కులగణనలో మాలలకు తీవ్ర అన్యాయం : గోపోజు రమేశ్​బాబు

కులగణనలో మాలలకు తీవ్ర అన్యాయం : గోపోజు రమేశ్​బాబు
  • 5 శాతం రిజర్వేషన్​ను మేం వ్యతిరేకిస్తున్నాం

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్​బాబు చెప్పారు. మంగళవారం ఆయన బాగ్ లింగంపల్లిలోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి ఏపీ నాటి 2011 జనాభా లెక్కలను ఎలా ఆధారంగా తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలో జనాభా లెక్కలు తీసి, వాటి ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.

 గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రెండు సార్లు వర్గీకరణ చేశారని, మాలలకు 6 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. ఇప్పుడు దాన్ని ఐదు శాతానికి మార్చితే మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని, మేనిఫెస్టోలో చెప్పినట్టు ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మాలలను కాంగ్రెస్​పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు.

మాల నేతలు ముందస్తు అరెస్ట్​

దిల్ సుఖ్ నగర్: కులగణన సర్వే, రిజర్వేషన్ల ప్రకటన కోసం మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్, మాల సంఘాల నేతలు రవి, ప్రభాకర్, కిరణ్, రామును సరూర్ నగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పీఎస్​కు తరలించారు.