మాలల ఆత్మగౌరవ సభను సక్సెస్ చేయాలి : తాళ్లపల్లి రవి

మాలల ఆత్మగౌరవ సభను సక్సెస్ చేయాలి :  తాళ్లపల్లి రవి
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రవి

మిర్యాలగూడ, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 19న మిర్యాలగూడ పట్టణంలో జరిగే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి కులస్తులకు పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలల ఆత్మగౌరవ సభ ఈనెల 19న ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సభకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

 దళిత వర్గాల్లో చిచ్చుపెట్టేందుకు వర్గీకరణ పేరిట ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దళితులంతా ఐక్యంగా ఉంటూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కల్పన, జనాభా అనుగుణంగా 30 శాతం రిజర్వేషన్ల పెంపు తదితర సమస్యలపై పోరాడాలని సూచించారు. ఆత్మగౌరవ సభకు మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు కోడిరెక్క శౌరి,  యూత్ రాష్ట్ర అధ్యక్షుడు మాడుగుల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేశ్, డివిజన్ నాయకుడు నాగటి గిరి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పెరుమాళ్ల ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.