చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్ అన్నారు. గురువారం చెన్నూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పాల్గొన్న పొట్ట మధుకర్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం మాలలు, ఎస్సీ వర్గీకరణ గురించి గోదావరిఖనిలో నిర్వహించిన ప్రెస్మీట్లో గోనె ప్రకాశ్ రావ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది సున్నితమైన అంశమన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అనుకూలంగా రెండు రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రకాశ్ రావు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. మాలల మీద విష ప్రచారం చేసి, అభాండాలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై, వారి కుటుంబంపై ప్రకాశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాకా కుటుంబం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు దశాబ్దాలుగా చేస్తున్న సేవలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకా కుటుంబానికి వచ్చిన పదవులన్నీ రాజ్యాంగ బద్ధమైనవేనని, ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపించుకున్నారనే విషయాన్ని ప్రకాశ్ రావు గుర్తుపెట్టుకోవాల న్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కాసారపు నవీన్, భూపెల్లి మల్లన్న, మండల రవికుమార్, బడుగుల తిరుపతి, దండు శంకర్, బొగే భారతి, దాసరి వెంకటస్వామి, దాసరి కమలాకర్, ఈట అశోక్, గాజుల ప్రశాంత్, గుర్రం రమేశ్ తదిత రులు పాల్గొన్నారు.