వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు

  • జాతీయ మాల మహానాడు సదస్సు హాజరైన ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
  • మాలలు ఐక్యంగా ఉంటేనే బలం: వివేక్

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: మాల సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని, ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి వివేక్​చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణకు జాతీయ మాల మహానాడు సంపూర్ణ మద్దతు పలికింది.

ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ సర్కార్ ​మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని, ఈ విషయాన్ని బీజేపీ ఎంపీలు, లీడర్లే చెబుతున్నారని పేర్కొన్నారు. రెండు మూడేండ్ల కింద కేసీఆర్​ కూడా అదే మాట అంటే తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓడించి గట్టిబుద్ధి చెప్పారన్నారు. మాల జాతిని అభివృద్ధి చేయడానికి మాలల్లో ఐక్యత, క్రమశిక్షణతోపాటు సంస్కృతి మరింత పెంపొందించుకోవాలని సూచించారు. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనపై వ్యతిరేకంగా కులవివక్షతతో  జడ్జిమెంట్​వచ్చిందన్నారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ కులవివక్షత నిర్మూలనకు కృషి మన జాతిని కాపాడారన్నారు.  

తెలంగాణ ఉద్యమంతో వీ6 ఛానల్​ తీసుకొచ్చా..

తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని, ఆ టైమ్​లో ఉద్యమానికి సపోర్టు చేసే టీవీ ఛానల్, పత్రిక​ లేదని వివేక్​వెంకటస్వామి అన్నారు. అందుకే సొంతగా ఛానల్​ పెట్టినట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో వీ6 ఛానల్​ పెట్టామని.. అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం, మన సంస్కృతి, యాస, భాషా చూపి ప్రజల మన్ననలు పొందిందన్నారు.

అప్పటి సీఎం కిరణ్​ కుమార్​రెడ్డికి వ్యతిరేకంగా ఛానల్​ఉందని బద్నాం చేసేందుకు తనపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. సదస్సులో జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్, జై భీం సైనిక్ దళ్ కోఆర్డినేటర్ అసాధి పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరయ్య, అధికార ప్రతినిధి నర్సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్,  జై భీం సైనిక్ జిల్లా అధ్యక్షులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు. 

రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న బీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతు 

అంబేద్కర్ రచించిన దేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తమన్న బీజేపీకి ఈ లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అందుకు వంత పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ కార్కూరి రాంచందర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార సభకు హాజరై మాట్లాడారు.

తమ తండ్రి కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సేవ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రెండు పర్యాయాలు గెలిచిన బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, బడా వ్యాపారులకు సహకరిస్తూ వచ్చిందన్నారు. గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.