- దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
- మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య
పద్మారావునగర్, వెలుగు: రిజర్వేషన్లు ఉండాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కావాలన్నా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండొద్దని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య చెప్పారు. సోమవారం బన్సీలాల్ పేట్ డివిజన్ న్యూ బోయిగూడలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్, మన్నె శ్రీధర్ రావులతో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు, ఓటు హక్కును కల్పించింది రాజ్యాంగం అనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీని గద్దె దించి, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీజేపీని ఓడించాలని కోరుతూ దళిత బహుజనులను, బీసీలను, మైనారిటీలను కలుస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి, సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి దళిత సమాజాన్ని కేసీఆర్ మోసం చేశారన్నారు. సమావేశంలో సనత్ నగర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ రమేశ్ బాబు, బన్సీలాల్ పేట డివిజన్ ప్రెసిడెంట్ పార్శి మహేశ్, డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐతా చిరంజీవి, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేద ప్రకాశ్‌యాదవ్, మహిళా కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ నస్రీన్ పాల్గొన్నారు.