లక్ష బరిసెలు, కర్రలతో ఫిబ్రవరి 2న మాలల శాంతి ర్యాలీ

  • మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ

ఖైరతాబాద్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని మాల సంఘాల జేఏసీ ఆరోపించింది. ‘రాజ్యాంగ రక్షణే దళితులకు రక్షణ,  రాజ్యాంగాన్ని రక్షించుకుందాం– రిజర్వేషన్లను కాపాడుకుందాం’ అంశంపై శనివారం హైదరాబాద్  సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం జరిగింది. మాల సంఘాల జేఏసీ నేతలు జి.చెన్నయ్య, మందాల భాస్కర్​ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను ఎత్తేస్తామని బీజేపీ నాయకులు గతంలో వ్యాఖ్యలు చేశారని అన్నారు. 

రాజ్యాంగం పరిరక్షణ కోసం ఫిబ్రవరి 2న మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  నెక్లెస్​ రోడ్డులో లక్ష మందితో లక్ష బరిసెలు, కర్రలతో నిరసన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఫూలే, అంబేద్కర్​ ఆశయాల కోసం పనిచేసే సంస్థలు, విద్యార్థులు, మహిళా సంఘాలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీసీ నాయకులు ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

 రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశాన్ని పార్లమెంటు ద్వారా కాకుండా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించి దళితకులాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో  చెరుకు రాంచందర్, గోపోజు రమేష్​ బాబు, బూర్గుల వెంకటేశ్వర్లు, మన్నె శ్రీధర్, కరణం కిషన్, జంగా శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.