
- మాల సంఘాల జేఏసీ చైర్మన్చెన్నయ్య
ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలు, మాల ఉపకులాలకు జరిగిన అన్యాయంపై ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్జి. చెన్నయ్య కోరారు. మాల జాతికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోతే ఆయా ఎమ్మెల్యేలు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. గురువారం మాల సంఘాల జేఏసీ నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్‌బాబు, మన్నె శ్రీధర్, ఎస్. సత్యనారాయణ, ఎమ్ఎమ్. సరళ, జంగా శ్రీనివాస్‌లతో కలిసి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. వర్గీకరణపై షమీమ్‌అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిననివేదిక తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించొద్దని కోరారు. మంద కృష్ణ మాదిగ ఒత్తిడికి తలొగ్గి బిల్లుకు సీఎం రేవంత్‌రెడ్డి చట్టబద్ధత తీసుకొస్తే నిరసనలతో రాష్ట్రం అగ్ని గుండంలా మారుతుందని చెప్పారు. మంద కృష్ణ మాదిగ బీజేపీతో అంటకాగుతూ సీఎంను బెదిరించే స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంపరికల్డేటా లేకుండా కులాలు, గ్రూపుల వారీగా విభజించిన వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వివరించారు.