ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి : మాల సంఘాల జేఏసీ

ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి : మాల సంఘాల జేఏసీ
  • మాల మాదిగ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి: మాల సంఘాల జేఏసీ

ముషీరాబాద్, వెలుగు: 2024 లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా పెరిగిందని.. అందుకు తగ్గట్టుగా 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. మాల మాదిగ ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. బడ్జెట్​లో రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించి.. ఎస్సీల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొంది.  ఎస్సీలలోని 59 ఉప కులాల మీద అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అత్తర్ ఏకసభ్య కమిషన్ ను హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో శుక్రవారం జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జి చెన్నయ్య, బేర బాలకిషన్, చెరుకు రామచందర్, బూర్గుల వెంకటేశ్వర్లు, కరణం కిషన్, మన్నె శ్రీధర్ ఎస్సీల లోని 59 ఉప కులాల మీద అధ్యయనం చేయాలని కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ కు వినతిపత్రం అందజేశారు. 

అనంతరం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మాలలు మాల ఉప కులాలకు గత 30 సంవత్సరాలుగా విపరీతమైన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలను ఏబీసీలుగా కాకుండా.. ఏ గ్రూపులో అత్యంత వెనుకబడిన బ్యాగరీ, నేతకాని, పోలియో దాసరి, మాల దాసరి, మాల అయ్యవారు, బైండ్ల, బుడుగ జంగాలు, సంచార జాతులు లాంటి ఉప కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, బీ గ్రూప్ లో మాల మాదిగలను చేర్చాలని ఇలా రెండు గ్రూపులుగా చేస్తేనే ఎస్సీ లలో ఉన్న అన్ని కులాలకు సంక్షేమ ఫలాలు అంది అభివృద్ధి చెందుతారని తెలిపారు.

ఎస్సీ లోని 59 ఉప కులాలుగా చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ నంబర్ 34 లో మాల అయ్యవారుగా చూపిస్తున్నారని.. అలా కాకుండా మాల అనే కులాన్ని సపరేట్​గా చూపించాలని ఏక సభ్య కమిషన్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రాష్ట్రంలో లేని ఉప కులాలను తీసుకువచ్చి గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుధీర్, సత్యనారాయణ, నాగేశ్వరావు, గోపూజ రమేష్, దాసరి విశాల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రోస్టర్ విధానంలో అన్యాయం

ఖైరతాబాద్: రోస్టర్​విధానంలో మాల, మాల అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల యూత్​ఫెడరేషన్​, మాల మేధావుల ఫోరం, మాల విద్యావంతుల వేదిక, మాల స్టూడెంట్​అసోసియేషన్ ఆరోపించింది. షమీమ్​అక్తర్ కమిషన్ నివేదికపై మందాల భాస్కర్​అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో శుక్రవారం రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు. రోస్టర్ పాయింట్​22లో ఉన్న మాల, మాల అనుబంధ కులాలను 7కు మార్చాలన్నారు. షమీమ్​అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్​లో పెట్టక పోవడం ప్రభుత్వ విఫలమేనన్నారు.