
ఆదిలాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం పున:పరిశీలించాలని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ కోరారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య, ఉద్యోగం, ఉపాధి, దళిత బంధు, దళిత బస్తీ, రాజకీయ అన్ని రంగాల్లో మాలలు, మాల ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఎస్సీ వర్గీకరణను పున:సమీక్షించి 2024 జనాభా లెక్కల ప్రకారం మాలలకు న్యాయం చేయాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాల సంక్షేమ సంఘం నాయకులు ఎం.మల్లన్న, బి.దేవన్న, ఎస్.అశోక్, సుధాకర్, ఎస్.భగవాన్లు, డి.బాబన్న తదితరులు పాల్గొన్నారు.