![తడిగుడ్డతో మాలల గొంతు కోసిన్రు](https://static.v6velugu.com/uploads/2025/02/mala-youth-federation-chairman-mandala-bhaskar-slams-cm-revanth-reddy-over-sc-classification_072oBrhy8k.jpg)
- మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్
ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తడిగుడ్డతో మాలల గొంతు కోశారని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మండిపడ్డారు. ఫిబ్రవరి 4ను బ్లాక్‌డేగా ప్రకటిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ నేత మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్మాట్లాడుతూ.. వర్గీకరణతో మాలలు నష్టపోతారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 4న మాలల జీవితాల్లో చీకటి నింపిందని మండిపడ్డారు. ఇప్పటికైనా మాలలు మేలుకోవాలని, ఏ రాజకీయ పార్టీ తమకు అండగా లేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి ద్రోహం చేసిందని, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాల, మాదిగ ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయడం సరికాదన్నారు. స్థానిక ఎన్నికల్లో మాలలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నామ సైదులు, మాల స్టూడెంట్లు పాల్గొన్నారు.