కాటారం, వెలుగు : వెనుకబడిన మంథని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మాలభేరి రాష్ట్ర అధ్యక్షుడు పీక కిరణ్ కోరారు. ఈ మేరకు బుధవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. చిన్న కాళేశ్వరంతో పాటు ఇచ్చంపల్లి, దేవాదుల ప్రాజెక్ట్‌కు బోర్లగూడెం వరకు లింకు కలిపేలా కేంద్రం చొరవ తీసుకునేందుకు కృషి చేయాలని కోరారు.
కాళేశ్వరం కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలను రక్షించాలన్నారు. కాటారం, మహదేవపూర్ మండలాల్లో ఉన్న దామెరకుంట, కాళేశ్వరం గ్రామాలను కొత్త మండలాలు చేయాలని, కాటారంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కృషి చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపుయాదవ్, గోగు రామస్వామి, గుంటి రాములు, గజ్జెల రాజయ్య ఉన్నారు.