
- శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ
- అక్కను కాపాడేందుకు గుండెపోటు డ్రామా
- మృతురాలి మేనమామ ఫిర్యాదుతో నిజాలు వెలుగులోకి
మలక్ పేట, వెలుగు: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జరిగిన శిరీష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆడబిడ్డ సరితనే ఆమెను మర్డర్ చేసినట్లు పోలీసులు తేల్చారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధారించారు. హత్య విషయం తెలిసినా.. దాన్ని బయటపెట్టకుండా సరితను కాపాడేందుకు శిరీష భర్త వినయ్, అతని అక్క కొడుకు నిహాల్ గుండెపోటు నాటకం ఆడినట్లు విచారణలో స్పష్టమైంది. బుధవారం కేసు వివరాలను చాదర్‌ఘాట్ పోలీసులు వెల్లడించారు.
శిరీష పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో ఆమెను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో సరిత, శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పని చేస్తూ స్నేహితులయ్యారు. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో తన సోదరుడు వినయ్ కుమార్ మంచి వ్యక్తి అని శిరీషను నమ్మించింది. 2017లో ఇద్దరికి పెండ్లి చేసింది. న్యూ మలక్‌పేటలోని జమున టవర్స్ ఫ్లాట్ నంబర్ 106లో శిరీష, వినయ్ కుమార్ కాపురం పెట్టారు. తర్వాత వీరికి కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే సరిత ప్రైవేట్ హాస్పిటల్లో పని మానేసింది. ఆ తర్వాత కూడా పలు హాస్పిటల్స్‌లో చాలా తక్కువ కాలం పని చేస్తూ వచ్చింది. తరుచూ హాస్పిటల్ ఎందుకు మారుతున్నావ్ అంటూ సరితను శిరీష ఈ నెల 1న నిలదీసింది. నీ చరిత్ర అంతా తెలుసని, త్వరలో బయటపెడ్తానంటూ సరితను శిరీష హెచ్చరించింది. దీంతో కోపంలో శిరీషపై సరిత ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తర్వాత ఇద్దరూ రాజీపడి ఎవరి గదుల్లో వాళ్లు వెళ్లి పడుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత రాడ్‌తో కొట్టడం వల్ల నొప్పిగా ఉందని, రోజూ తీసుకునే ఇంజెక్షన్ ఇవ్వమని సరితను శిరీష అడిగింది. అప్పటికే శిరీషపై కక్ష పెంచుకున్న సరిత.. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. మత్తులోకి జారుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసి శిరీషను చంపేసింది. మర్నాడు శిరీష భర్త వినయ్‌కుమార్, అక్క కొడుకు నిహాల్‌కు విషయం చెప్పింది. అక్కను కాపాడుకునేందుకు వినయ్‌కుమార్, నిహాల్ కలిసి గుండెపోటు డ్రామా ఆడారు. శిరీషను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని శిరీష మేనమామ మధుకర్, అక్క స్వాతికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్లు వచ్చేలోపే అంబులెన్స్‌లో డెడ్‌బాడీని శ్రీశైలం రోడ్డులోని దోమలపెంటకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని ప్లాన్ చేశారు.
మెడ, ముఖంపై గాయాలు..
డెడ్‌బాడీ చూపించకుండా తప్పించుకుని తిరగడంతో అనుమానం వచ్చి శిరీష మేనమామ మధుకర్ చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి డెడ్‌బాడీని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. ఆమన్‌గల్ వరకు వెళ్లిన అంబులెన్స్.. తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. డెడ్‌బాడీని పరిశీలించిన పోలీసులు.. మెడ, ముఖంపై గాయాలు గుర్తించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిరీషను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో చాదర్‌ఘాట్ పోలీసులు వినయ్, సరిత, నిహాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. శిరీషను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకోవడంతో సరిత, వినయ్, నిహాల్‌ను రిమాండ్‌కు తరలించారు.