డిసెంబర్ 1న మాలల సింహ గర్జన

కందుకూరు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో 10 లక్షల మందితో జరిగే మాలల సింహ గర్జనను జయప్రదం చేయాలని తెలంగాణా మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ కోరారు.  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో మాల ఉద్యోగులు,మాల యువజన సంఘాలు,మాల ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి తెలంగాణా మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో 10 లక్షల మందితో జరిగే మాలల సింహ గర్జన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడానికి, తెలంగాణలోని లక్షలాది మంది మాలలు అహోరాత్రులు కష్టపడ్డ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోకూడదన్నారు.

తెలంగాణలో ఎస్సీలకు కావలసింది వర్గీకరణ కాదని, తెలంగాణలో ఉన్న దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పారు. అందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్నారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన మాలల కోసం ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. మాలల సింహా గర్జనను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో  మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.