షెడ్యూల్డ్ కులాల్లో కొన్ని ఉప కులాలకు అన్యాయం జరుగుతున్నదంటూ కొందరు చేసిన అవాస్తవిక వాదనతో, 1997లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అశాస్త్రీయంగా వర్గీకరణ చేపట్టిందనేది ఎస్సీలలో మాలల వాదన. స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన వర్గాల మనసు గెలిచారు. దళితులు, గిరిజనుల జనాభా దామాషా ప్రకారం వారి నిధులను వారికే కేటాయించే విధంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలను ప్రవేశపెట్టింది కూడా ఆమెనే. దీంతో దళిత వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారని, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని, వీరిలో ఒక వర్గాన్ని అయినా చీల్చి తమకు అనుకూల ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే సంకల్పంతో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేపట్టారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.
ఇ దే సందర్భంలో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ద్వారా నివేదికను తామనుకున్నవిధంగా ఇప్పించుకున్నదని మరో ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారంలో మాలలను టార్గెట్ చేస్తూ కొందరు వారిని ఇతరుల అవకాశాలను కాజేసిన దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనే విషయంలో మాలల ఆత్మగౌరవంపై దాడి జరుగుతున్నదని దళిత మేధావులు అభిప్రాయపడుతున్నారు.
వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో..ఆత్మగౌరవ చైతన్యం
తెలంగాణలో వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో మాలల ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, మాలల సింహగర్జన సభను హైదరాబాద్లో నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తోంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రిజర్వేషన్లను మాత్రమే తమంతట తాము రాత్రనకా, పగలనకా కష్టపడి నిరుపేద నేపథ్యంలో విధిని ఎదిరించి చదివి ఉన్నత ఉద్యోగాలు పొందామని లబ్ధి పొందినవారి అభిప్రాయం. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగినదే కదా? రాజ్యాంగ ఉల్లంఘనలు ఏమీ జరగలేదు కదా? అని వారి వాదన. అప్పటి భారత ప్రభుత్వం ఆర్టికల్ 341, ఆర్టికల్ 16ల ద్వారా షెడ్యూల్లో చేర్చబడిన ఉపకులాలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించింది.
ఈ రిజర్వేషన్లు ఉపకులాలన్నిటికీ వర్తించబడ్డాయి. దీనిలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇవ్వలేదు. ఆయా కులాలు వారి పరిస్థితుల నేపథ్యంలో కొందరు చదువు, ఉద్యోగాలపైన దృష్టి పెడితే, మరికొందరు కులవృత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టి వాటి ద్వారా జీవనోపాధి పొందడం జరిగింది. వర్గీకరణ అంశంతో మాలలను సమాజంలో ఒంటరిని చేసే చర్యలు వాంఛనీయం కాదు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను ఆకళింపు చేసుకొని సమాజంలో కులం ప్రభావాన్ని తగ్గించే దిశగా విద్యను ఒక మార్గంగా ఎంచుకొని సమాజంలో తలఎత్తుకు తిరిగే స్థాయికి చేరుకున్నారు దళితుల్లో కొందరు. వారు మాలలు కావొచ్చు లేదా మాదిగలు లేదా ఇతర ఉప కులాలు కూడా కావొచ్చు. అది జరిగినది డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలన మూల సూత్రానికి ప్రాతిపదికన మాత్రమే కదా అని వారంటారు.
Also Read : జనం గుండె చప్పుడు ఈశ్వరీబాయి
మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఖండించాలిమాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజాస్వామిక మేధావులు ఖండించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఉపయోగించుకుని తరతరాలుగా అణచివేతకు గురవుతున్న తమను తాము ఉన్నతీకరించుకోవడమే మేం చేసిన నేరమా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అడగకపోయినా, ఏ డిమాండ్ లేకపోయినా ఎస్టీలను విభజించేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక ఏమి జరిగిందనేది బహిరంగ రహస్యమే. ఎస్సీలలో మాలలు అత్యధికంగా లబ్ధి పొందారనడానికి వాస్తవిక ఆధారాలు ఏమిటనేది ప్రశ్న. 27 ఏండ్ల క్రితం నాటి జస్టిస్ రామచందర్ రాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏ విధంగా దీనిని ధ్రువీకరించగలం. ఆ నివేదిక లోపభూయిష్టం అనేది బహిరంగ రహస్యమే కదా. ఇప్పటివరకు అధికారిక కులగణన జరగలేదు కదా అనేది మాలల వాదన. ఉపకులాల జనాభాను ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో ఎవరు ఎంత లబ్ధి పొందారు అనే దానిని కూడా ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో మాలలు అత్యధికంగా లాభపడ్డారంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు సమంజసం?
మాలల ఐక్యతకు వివేక్ మార్గదర్శకత్వం
మాలలను దోపిడీదారులుగా, ఇతర కులాల అవకాశాలు లాగేసుకున్న కుసంస్కార్లుగా చిత్రీకరించడం వెనుక మనుస్మృతి దాగి ఉందా? ఈ వాదనకు మరింత బలం చేకూర్చి తదనంతరం రిజర్వేషన్లు నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉన్నదా? అని వారి ఆవేదన. వర్గీకరణ ముసుగులో దళితులను అణచివేసే కుట్రగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పులో ఎస్సీ, ఎస్టీల వర్గీకరణే కాదు, క్రిమిలేయర్ అంశాన్ని స్పృశించారు. సుప్రీం తీర్పు అనంతరం దేశంలోనే తొలిసారిగా మాలల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. దేశంలో దళితులకు పెద్దదిక్కుగా నిలిచిన స్వర్గీయ గడ్డం వెంకటస్వామి సదాస్మరణీయులు. వారి కుమారుడిగా రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వివేక్ వెంకటస్వామి మాలలకు మార్గదర్శకత్వం వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మాలల ఐక్యతకు వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు ఆయన ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. దేశంలో ఒక కులాన్ని బోనులో నిలబెట్టి, వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కుట్రలకు చెక్ పెట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నంలో వారు సఫలీకృతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఈ ప్రయత్నంలో భాగస్వాములు
కావాల్సిన అవసరం ఉన్నది.
- నేలపూడి స్టాలిన్ బాబు
సోషల్ ఎనలిస్ట్