- మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణలో చెన్నూరు ఎమ్మెల్యే
ముషీరాబాద్/కూకట్‌పల్లి, వెలుగు : రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న మాలలకు సరైన గుర్తింపు దక్కడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మాలల ఆత్మ గౌరవం కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 1న జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున మాలలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం విద్యానగర్‌లోని కమిటీ హాల్‌లో రామభాయి మాలల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది.
దీనికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో కలిసి వివేక్ వెంకటస్వామి హాజరై సింహగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. మాలలు అంతా సింహగర్జనలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తాను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు తనకు ఎన్నో కార్యక్రమాలకు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి అండగా నిలిచి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి మల్ల పార్వతి, కాలకోట సత్యనారాయణ, బత్తుల రవి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ, మోడీ రాందేవ్ పాల్గొన్నారు.
సింహగర్జనలో మహిళలు ముందుండాలె..
హక్కుల రక్షణ కోసం మాలలు ఐక్యంగా ఉద్యమించాలని వివేక్ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సింహగర్జన సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరగనున్న మాలల సింహగర్జన సభను సక్సెస్ చేసి, మాలల ఐక్యతను, ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు.
మాలల ఐక్యత ఉద్యమంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారు ముందుకొస్తే సింహగర్జన సభ దద్దరిల్లుతుందన్నారు. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి కొట్లాడకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారం అవుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ నిర్వాహకులు దర్శనం శాకయ్య, దుబ్బాక నవీన్, శామ్యూల్, గౌతమ్ పాల్గొన్నారు. అదేవిధంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం, అంబేద్కర్‌నగర్ లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.