బాలికా విద్యకు దిక్సూచి మలాల ..

బాలికా విద్యకు దిక్సూచి మలాల ..

 నేటి కాలంలో బాలికల, మహిళల చదువు కోసం తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడిన బాలికనే మలాల యూసఫ్ జాయ్’. ఆమె నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈమె జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచంలో పలు దేశాలు జులై 12వ తేదీన ‘ ప్రపంచ మలాల దినోత్సవం’ గా జరుపుతున్నారు.

పాకిస్థాన్​లోని బాలికల చదువు కోసం చిన్నతనం నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి, తన కలాన్ని, గళాన్ని ధైర్యంగా బహిరంగంగా వినిపిస్తున్న మలాలపై ఆనాటి పాకిస్థాన్ తాలిబన్లు అక్టోబర్ 9, 2012లో తుపాకీతో కాల్చి చంపబోయిన తరుణంలో, తీవ్రంగా గాయపడిన మలాల ప్రాణగండం నుంచి బయటపడి, తన ఆశయాన్ని మరింత బలంగా నేటికీ వినిపిస్తోంది.‌‌ 

ఈమె లక్ష్య సాధనకు అందరూ ఒకటై బాసటగా నిలిచారు. మహిళలు, బాలికల చదువు కోసం, హక్కుల కోసం నిరంతరం పరితపిస్తున్న మలాల సేవలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.   2015 నుంచి ప్రతి ఏటా జులై 12వ తేదీన  మలాల దినోత్సవంగా ప్రకటించింది. తన తండ్రి సహకారంతో బాలికల చదువు కోసం హక్కుల కోసం కంకణం కట్టుకుని పని ప్రారంభించింది. యావత్ ప్రపంచం అండగా నిలుస్తున్నది.‌‌

నోబెల్ ​మలాల

2011లోనే బీబీసీ డాక్యుమెంటరీ చిత్రం నిర్మాణంలో తన జీవిత గాథను, తాలిబన్ల అరాచకాలను ప్రపంచంతో పంచుకుంది. మహిళలు, బాలికలపై తాలిబన్ల చేష్టలు, దాడులను వివరించింది.‌‌ 2012లో‌‌ తన తండ్రి సహకారంతో 12 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న బాలికల చదువు కోసం ‘మలాల ఫండ్’ నిధిని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించి బాలికల విద్య కోసం శ్రమిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

అందుచేతనే ప్రపంచంలోనే అతిచిన్న వయస్సు 14 సంవత్సరాల వయసులోనే ‘ నోబెల్ బహుమతి’ 2014లో అందుకున్న మహిళగా గుర్తింపు పొందింది.‌‌ ఈమె ధైర్యం, స్ఫూర్తితో ప్రపంచంలో అనేక మంది బాలికలు, మహిళలు మతం పేరుతో అణచి వేతకు గురవుతున్న వారు, పరదాలు దాటి బయటకు వచ్చి విద్య అభ్యసిస్తున్నారు. ఆమె ‘ ఐ యామ్ మలాలా’ అనే పుస్తకం రాశారు. 

ఛాందసవాదుల నిర్బంధం

నేటికీ  ‘ఆఫ్ఘనిస్తాన్’ వంటి దేశాల్లో బాలికల, మహిళల చదువుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇరాన్​లో మహిళలపై ఆంక్షలు, మన దేశంలో కర్ణాటకలో హిజాబ్ ఉదంతం మనం అందరం చూశాం. మనదేశంలో నేటికీ అనేక ప్రాంతాల్లో బాలికల చదువు అంతంత మాత్రంగానే ఉంది. మత, లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. 

బాలికల డ్రాప్​అవుట్లు

పదవ తరగతి తరువాత బాలికల్లో ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాలికలకు పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, సౌకర్యాలు, టాయ్​లెట్ లేకపోవడం వలన బాలికల చదువు హైస్కూల్ చదువుతో ముగించే పరిస్థితి నెలకొంది. 

మహిళల అభివృద్ధే దేశాభివృద్ధి

బాల్య వివాహాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి.‌‌ ర్యాగింగ్ పడగ విప్పుతోంది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి. దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలపై రోజూ అనేక అమానుష దాడులు జరుగుతున్నాయి. బాలికల  పోషకాహార లోపం నివారణకు చర్యలు తీసుకోవాలి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ‘ఒక దేశ అభివృద్ధి మహిళల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.

 ఇకనైనా ప్రభుత్వాలు బాలికా, మహిళల హక్కులు, రక్షణ, చదువు కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.  ‘ఒక శిశువు, ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, ఒక కలం ప్రపంచ చరిత్రను తిరగరాస్తాయి’ అని మలాలా చెప్పిన మాటలు నిజమే కదా.

- ఐ.ప్రసాదరావు