- మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
వనపర్తి టౌన్, వెలుగు: ప్రజా యుద్దనౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ అవార్డులకు వ్యతిరేకమని.. అవార్డులు, పేరు కోసం ఏనాడూ ప్రయత్నించలేదన్నారు. రాజకీయాలతో ఇచ్చే లొట్ట పీసు అవార్డులు గద్దర్ కు అవసరం లేదని, ఒకరి కాళ్లు మొక్కితే ఇచ్చే అవార్డులు తమకు వద్దన్నారు
తెలంగాణ సమాజానికి గద్దర్ పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. గద్దర్ పై బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణ కవులు, కళాకారులు, సీనియర్ జర్నలిస్టులు, కమ్యూనిస్టులు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగ వ్యతిరేకులు పరిపాలన చేస్తూ, అట్టడుగు వర్గాలపై కులం, మతం పేరుతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి మద్దతు తెలిపే వారికి మాత్రమే పద్మ అవార్డు ఇస్తామనడం సిగ్గు చేటన్నారు. జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి, జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భోజరాజు, కర్నె తగ్గయ్య, అంబటి రవి, రమేశ్, యాదగిరి, నాగరాజు, వెంకటేశ్, చంద్రశేఖర్, నాగయ్య, కరుణాకర్, రఘురాం పాల్గొన్నారు.