మమత కోటలో మాలా రాయ్!

సౌత్ కోల్ కతా నుంచి పోటీ చేస్తున్న మాలారాయ్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నెల 19న పోలింగ్​ జరగనున్న పశ్చిమబెంగా ల్ లో ని తొమ్మిది సెగ్మెంట్లలో దక్షిణ కోల్ కతా ఒకటి. రాష్ట్రంలో ఏ సెగ్మెంట్ కు లేని ప్రత్యేకత దీనికి ఉంది. ఇక్కడ తృణమూల్‌ నుంచి మాలా రాయ్ పోటీ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ సెగ్మెంట్ కు మమతా బెనర్జీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన మాలా రాయ్ ఇప్పుడు టీఎంసీ కేండిడేట్ గా ఇక్కడ హల్ చల్ చేస్తున్నారు.

కోల్ కతా మునిసిపల్​ కార్పొరేషన్ ​(కేఎంసీ)లో 88వ​ వార్డు కౌన్సిలర్​గా 1995 నుంచి పాతికేళ్లుగా కంటిన్యూ అవుతున్న మాలా రాయ్​ ఇప్పుడు జాక్​పాట్​ కొట్టేశారు. 17వ లోక్‌సభకి అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున దక్షిణ కోల్‌కతా స్థానానికి టికెట్‌ లభించింది. ఇప్పటికే మాలా రాయ్‌ కేఎంసీకి తొలి మహిళా చైర్​పర్సన్​గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ నెల 19న పోలింగ్‌ జరిగే సౌత్​ కోల్‌కతా సెగ్మెంట్​పై ప్రతి ఒక్కరి చూపూ ఈ నియోజకవర్గం వైపే ఉంది.

అప్పుడే ఉండి ఉంటే..
తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ) చీఫ్, పశ్చిమ బెంగాల్​ చీఫ్​ మినిస్టర్​ అయిన మమతా బెనర్జీ లోక్​సభకు దక్షిణ కోల్‌కతా నుంచే 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించారు. 1991 నుంచి 2011 వరకు వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్​ ఫ్రంట్‌ని ఓడించి టీఎంసీ తొలిసారి సర్కారు ఏర్పాటు చేసింది. ప్రభుత్వాధినేతగా పగ్గాలు చేపట్టడంతో దక్షిణ కోల్​కతా ఎంపీ సీటుకి మమత రాజీనామా చేయాల్సి వచ్చింది.

అదే ఏడాది భవానీపూర్​ అసెంబ్లీ సెగ్మెంట్‌కి జరిగిన బైఎలక్షన్​లో మమతా బెనర్జీ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. సౌత్​ కోల్​కతా లోక్​సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో సుబ్రతా బక్షి (తృణమూల్‌) గెలిచారు. తర్వాత జరిగిన (2014) సాధారణ ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనే విజయం సాధించారు. అయితే ఇక్కడ ఒక డౌటు రావొచ్చు. 2011 బైఎలక్షన్​లోనే మాలా రాయ్​కి టికెట్​ ఇవ్వొచ్చు కదా అనిపించొచ్చు. కానీ, ఆ సమయంలో ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు. టీఎంసీలో లేకపోవటం వల్లే బంగారం లాంటి చాన్స్‌ మిస్సయారు.

2015లో రీఎంట్రీ
2005లో టీఎంసీని వీడిన మాలా రాయ్.. పదేళ్ల తర్వాత 2015లో కేఎంసీ ఎలక్షన్స్​ సందర్భంగా మళ్లీ ఆ పార్టీలో చేరారు. 2014లో ఆమె సౌత్​ కోల్​కతా సెగ్మెంట్​లో హస్తం పార్టీ తరఫున నిలబడి ఆమె ఘోర పరాజయం చవిచూశారు. వివిధ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యను బట్టి టీఎంసీ, బీజేపీ, సీపీఎం తర్వాత నాలుగో స్థానంలో మాలా రాయ్‌ ఉండాల్సి వచ్చింది.

టీఎంసీ అభ్యర్థి సుబ్రతా బక్షి మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. దీన్నిబట్టి దక్షిణ కోల్​కతాలో తృణమూల్‌కి ఎంత పట్టు ఉందో అర్థమవుతోంది. అధికార పార్టీ హవా ఈ రేంజ్​లో ఉండబట్టే మాలా రాయ్‌ ఈసారి గెలిచి తీరతాననే నమ్మకంతో ఉన్నారు.  టీఎంసీకి సేఫ్​ సీట్​గా భావించే ఈ సెగ్మెంట్​లో తనకు పార్టీ టికెట్​ వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె​ సంతోషంతో ఉన్నారు. మమతనిర్ణయం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి
చేసిందన్నారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్​ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై పోటీ చేసిన చంద్ర కుమార్​ బోస్​ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ఎలక్షన్​లో టీఎంసీ తర్వాత ఎక్కువ ఓట్లను కాంగ్రెస్​ పార్టీ దక్కించుకుంది. దక్షిణ కోల్​కతాలో లోక్​సభ ఎన్నికల ప్రచార సరళిని, గ్రౌండ్​ లెవల్​ రియాలిటీని గమనిస్తే టీఎంసీకే గెలుపు సూచనలు ఉన్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దీంతో.. మాలా రాయ్​ కూడా మమతా బెనర్జీ మాదిరిగా సుదీర్ఘ కాలం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారో లేదో చూడాలి.