కోల్బెల్ట్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించేలా, ఆర్టికల్ 341కు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. దేశంలోని ఎస్సీలను అస్తిరపరిచేందుకు ప్రధాని మోదీ సర్కార్వర్గీకరణకు పూనుకుందని మండిపడ్డారు.
పార్లమెంట్ ఆమోదం లేకుండా వర్గీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజెల్లి లక్ష్మణ్, జై భీమ్ సైనిక్దళ్రాష్ట్ర కన్వీనర్అసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్తెపు శంకర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్, మాల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్గీకరణ తీర్పుపై పునఃపరిశీలించాలి
కాగజ్ నగర్, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కాగజ్నగర్ పట్టణ అధ్యక్షుడు డొంగ్రి సునీల్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వర్గీకరణ రద్దు చేయాలని నిరసన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం అందజేశారు. మహానాడు అధ్యక్షుడు పరుస వెంకటేశ్,ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత పోరాట సమితి నాయకులు దుర్గం ఇస్తారు, రామ్టెంకి అజయ్, తౌటి తిరుపతి, ఉపాధ్యక్షుడు మల్లెపల్లి రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.