సినిమా నటుల్లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్నిరకాలుగా పేరు తెచ్చుకునే నటులు కొద్దిమందే ఉంటారు. ఆ కోవకే చెందుతాడు ఆసిఫ్ అలీ. మలయాళంలో ఈ నటుడికి స్టార్ హీరోల రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా కలిసి చేస్తున్న ‘మనోరథంగళ్’ వెబ్‌సిరీస్‌లో ఇతను కూడా ఒక రోల్ చేశాడు. ఈ మధ్య విడుదలైన ‘లెవల్ క్రాస్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ జర్నీ గురించి...
‘‘మాది కేరళలోని కోరికోడ్. నేను అక్కడే పుట్టి పెరిగా. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశా. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ వైపు ట్రై చేశా. వీడియో జాకీగా పనిచేశా. అడ్వర్టైజ్మెంట్స్లో చేశా. 2009లో ‘రితు’ అనే సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఏడాది ‘కథ తుడరున్ను, అపూర్వరాగం’ సినిమాల్లో నటించా. నిత్యమెనన్ నటించిన ‘అపూర్వ రాగం’ సినిమాకి బెస్ట్ విలన్‌గా ఏసియానెట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నా. ఆ తర్వాత వరుసగా ‘బెస్టాఫ్ లక్ (2010), ట్రాఫిక్ (2011), సాల్ట్ ఎన్ పెప్పర్ (2011)’ సినిమాలు చేశా. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అది నా కెరీర్లో మైలురాయి
‘తలవన్’ సినిమా దర్శకుడు జిస్... ఒక ఏడాది కిందట నాకో కథ చెప్పాడు. ఆ కథ వినగానే నాకు చాలా నచ్చింది. స్క్రీన్ ప్లే పూర్తి చేసి చెప్పగానే.. ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నా. అందులో నా క్యారెక్టర్ స్కెచ్ చాలా నచ్చింది. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా. ఈ సినిమాలో నాతోపాటు బిజు మెనన్ కూడా పోలీస్ రోల్ చేస్తున్నారు. పోలీస్ రోల్‌కి ఆయన కరెక్ట్‌గా సరిపోతారు. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆయనతో కలిసి నేను కూడా పోలీస్ క్యారెక్టర్ చేయడం ఒకరకంగా నాకు ఛాలెంజ్ అనే చెప్పాలి. నా మొదటి సీన్ ఆయనతోనే. ఆయన ఆధ్వర్యంలో నేను కొత్తగా జాబ్‌లో చేరి, ఛార్జ్ తీసుకోవాలి. ఆ సీన్ చేసేటప్పుడు కొంత ఆదుర్దా కలిగింది.
వాళ్లకు ఆ సంతోషన్నిచ్చా
నటుడిగా నేను చేసే పాత్రల్లో లక్ ఎప్పుడూ పనిచేయదు. నేను లీడ్ రోల్ చేసిన కొన్ని సినిమాలు మాత్రమే కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. అయితే కొన్ని మంచి సినిమాలు మాత్రం ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిలయ్యాయి. ‘తలవన్’ సినిమాకి మంచి విజయాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. చాలాకాలం తర్వాత ఆ రోజు ప్రేక్షకుల టైం వేస్ట్ చేయకుండా కంటెంట్‌తో ఉన్న సినిమాతో నా రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించా అనిపించింది. అంతేకాదు..
నా పదిహేనేండ్ల కెరీర్లో మా అమ్మానాన్న నేను చేసిన వాటిలో మొదటిరోజు చూసిన సినిమా ఇదే. ఆ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ల ముఖంలో ఆనందం, గర్వం కనిపించాయి. అది చూసిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నేనెన్నటికీ మర్చిపోలేని క్షణం. నా స్కూల్ లైఫ్‌లో, ఆ తర్వాత నేనెప్పుడూ వాళ్లకు ఆ సంతోషాన్ని అందించలేకపోయా. ఇప్పుడు వాళ్లకు ఆ సంతోషాన్నిచ్చినందుకు గర్వంగా అనిపించింది.
ఆ ఛాన్స్‌లు మిస్సయ్యా
మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’లో అర్జున్ అశోకన్ పాత్రకు మొదట నన్ను అడిగారు. నేను కూడా ఒప్పుకున్నా. కానీ, ఆ సినిమా షూటింగ్ అనుకున్న టైం కంటే ముందు మొదలైంది. అప్పటికే మమ్ముట్టి గడ్డం పెంచారు. ఆయనకు వేరే ప్రాజెక్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే.. ఇబ్బంది అవుతుందని వెంటనే షూటింగ్ మొదలుపెట్టారు. నాకు అప్పటికే వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది. ఆ పాత్ర అర్జున్ అశోకన్‌కు వెళ్లింది. అది తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా విషయానికొస్తే... ఆ కథలో పాత్ర ఉంది. కానీ, క్యారెక్టర్స్ డెవలప్ చేశాక నాకు ఛాన్స్ రాలేదు. అలా రెండు పెద్ద సినిమాలు మిస్ అయ్యా.
ప్రతిరోజు రాత్రిపూట నేను ఒక్క సినిమా అయినా చూడకపోతే నిద్రపోను. థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే టైం లేకపోతే ఇంట్లో టీవీలో చూస్తా. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తా. నాకెప్పుడూ బోర్ కొట్టని విషయం ఏదైనా ఉందంటే అది సినిమానే.
ఆలోచన మారింది
రివ్యూలు గమనిస్తుంటా. ఎందుకంటే కొందరు విమర్శకులు రాసే రివ్యూలకు చాలా వ్యాల్యూ ఉంటుంది. అవి నా వర్క్ గురించి నాకు తెలియజేస్తాయి. ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? అనేది తెలుసుకోవడానికి సాయపడుతుంది. కానీ, కొందరు సినిమా చూడకుండానే రివ్యూలు చెప్తుంటారు. అలాంటి రివ్యూలు బుర్రకి ఎక్కించుకుంటే నిరుత్సాహంగా ఉంటుంది. అసలు అలాంటి రివ్యూలు ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది నావరకయితే.
ప్రొడక్షన్లోకి అడుగుపెట్టాక సినిమాని చూసే దృష్టి కోణం మారింది. ఒక యాక్టర్‌గా నేను సినిమాని వివిధ కోణాల్లో అన్వేషించాలి అనుకుంటా. ముందుముందు డైరెక్షన్ చేసే ఆలోచన ఉంది. అది ఎప్పుడనేది మాత్రం కచ్చితంగా చెప్పలేను. కానీ, తప్పకుండా ట్రై చేస్తా.
అది నాకు కేజీఎఫ్ లాంటిది!
‘టికి టాకా’ సినిమా నాకు ‘కేజీఎఫ్’ సినిమాలాంటిదని ఇంతకుముందు చెప్పా. ఆ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. మేం150 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. కానీ, మొదటి పదిహేను రోజుల్లో నాకు గాయం అయింది. దాంతో మూడు నెలలు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. అయినా నయం కాలేదు. గాయం నయంకావడానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పడుతుందని అంచనా వేశాం. దానివల్లే ‘టికి టాకా’ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ మొదలుపెట్టాలంటే నా మీద నాకు పూర్తి విశ్వాసం రావాలనే టైం తీసుకున్నా. ఆ సినిమాలో హెవీ వెయిట్స్తో యాక్షన్ సీన్స్ ఉన్నాయి.
ఫోన్లో స్క్రిప్ట్ వినను
నేను ఫోన్ చాలా తక్కువగా వాడతా. షూటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకోవడం చాలా అరుదు. ఎందుకంటే ఫోన్ వాడానంటే పరధ్యానంలోకి వెళ్తా. అందుకే ఫోన్‌కి దూరంగా ఉంటా. సోషల్ మీడియా మీద నాకు ఆసక్తి ఉండదు. సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేసేందుకు ఎవరినీ నియమించుకోలేదు. షూటింగ్ ఇంటర్వెల్స్‌లో నేను విన్న కథలే చాలావరకు ఎంచుకుంటా. ఫోన్లో స్క్రిప్ట్ వినను. నా సినిమాల్లో ఒకదానికైనా పనిచేసి ఉండాలనే షరతు డెబ్యూ డైరెక్టర్లకు పెట్టా. అలాఎందుకంటే అలా చేయడం వల్ల నా వర్క్ గురించి వాళ్లకు, వాళ్ల వర్క్ గురించి నాకు అవగాహన ఉంటుంది.
నా ఫ్యామిలీ విషయానికి వస్తే... మా అబ్బాయి ఆడమ్‌కి ఇప్పుడు పదేండ్లు. తనకు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆడమ్ వయసు పిల్లలు సహజంగానే సినిమాలంటే ఎగ్జైట్ అవుతారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే వాళ్ల కోసం వాళ్లు ఎంజాయ్ చేసేలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నా.
మనోరథంగళ్ కాంట్రవర్సీ
మనోరథంగళ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఒక ఇష్యూ జరిగింది. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రమేశ్ నారాయణ్‌కి మెమెంటో ఇచ్చేందుకు నన్ను పిలిచారు. అది ఆయనకు ఇచ్చా. కానీ, అప్పుడు ఒకరినొకరం పరిచయం చేసుకోలేకపోయాం. ఆయన మెమెంటో తీసుకున్నాక డైరెక్టర్ని పిలిచి మళ్లీ ఆయన చేతుల మీదుగా తీసుకున్నారు. ఇదంతా జరిగింది వేదిక కింద. ఆ విషయమై ‘ఆయన నన్ను పట్టించుకోలేదు. అవమానించారు’ అని నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రమేశ్ నారాయణ్, నేను.. ముగ్గురం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ క్షణం చాలా హడావిడిగా ఉండడంతో ఆయన నన్ను పలకరించలేకపోయారు. పైగా దానికి నేనేం బాధపడలేదు. ఆయనకు నన్ను అవమానించాలనే ఉద్దేశం లేదు. అలాగే పెద్దవాళ్లంటే నాకు గౌరవం ఉంది. ఆయన్ని విమర్శించడం ఆపమని నా తరఫున నెటిజన్లకు చెప్పా.
స్టార్ అనిపించుకోవాలని లేదు
స్టార్డమ్ కావాలి అనుకోవడం లేదు. అందుకే నేను అలాంటి మాస్ కథలు ఎంచుకోవట్లేదు. ‘ఉయిరే’ సినిమాలో గోవింద్ పాత్రలాంటి క్యారెక్టర్లు నా కెరీర్‌ను ఎంతో ఉన్నతంగా నిల్చోబెట్టాయి. నటుడిగా నాకు సంతృప్తినిస్తాయి. అలాగని హీరోయిక్ పాత్రల్లోనే చేయలేనని కాదు. నాకు నచ్చిన స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చేస్తుంటాం. నేను నటించిన ‘లెవల్ క్రాస్’ సినిమా రిలీజ్ అయింది. అది డిఫరెంట్ స్క్రిప్ట్. ‘మనోరథంగళ్’ మల్టీ స్టారర్ మూవీ. అందులో కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఉన్నారు.