పరిచయం : నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్​ నటి : దివ్య

పరిచయం : నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్​ నటి : దివ్య

ఆర్టిస్ట్​ అవ్వాలనుకోలేదు.. అనుకోకుండానే యాక్టర్​నయ్యా’ అనేది చాలామంది నటీనటులు చెప్పేమాట. ఈ మలయాళీ అమ్మాయి కూడా ఆ కోవలోకే వస్తుంది. అనుకోకుండా నటిగా మారినా.. అద్భుతమైన నటనతో అంతులేని గుర్తింపును తెచ్చుకుంది.దాదాపు పదేండ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న దివ్య జర్నీ.. ఆమె కుటుంబ నేపథ్యం, ఆల్ వి ఇమాజిన్ యాజ్​ లైట్​ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు ఆమె మాటల్లోనే...

మాది కేరళలోని త్రిస్సూర్. గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదివా. చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీ ఫెస్టివల్స్, ఈవెంట్స్​లో చాలా యాక్టివ్​గా ఉండేదాన్ని. కానీ, కెమెరా ముందుకు రావాలంటే మాత్రం చాలా భయం. ఇక యాక్టర్​ అవ్వాలని గానీ, అవుతానని గానీ ఎప్పుడూ అనుకోలేదు. మా ఫ్యామిలీకి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. మా నాన్న లీగల్ కన్సల్టెంట్​గా పనిచేసేవాళ్లు. అమ్మ పెండ్లికాక ముందు నుంచే నర్స్. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు.

మా పేరెంట్స్ ఎప్పుడూ మా ఇష్టాలను కాదనలేదు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇండిపెండెంట్​గా బతకడం అవసరం అనుకున్నా. అందుకని, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో కౌన్సిలర్​గా పనిచేశా. అదే టైంలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్​మెంట్​లో ఎంబీఏ చేశా. ఆ రోజుల్లో పొద్దున్నే మార్నింగ్​ వాక్​కి వెళ్లేదాన్ని. ఒకరోజు ఒక ఫిల్మ్ షూట్ జరుగుతుంటే అక్కడ ఆగి కాసేపు అంతా గమనించా. కాసేపటి తర్వాత ఒకతను వచ్చి నెక్స్ట్​ సీన్​ వరకు కూర్చుంటారా? అని అడిగారు. షూట్​ దగ్గరి నుంచి చూడొచ్చు అనే ఉద్దేశంతో ‘సరే’ అన్నాను. ఆ తర్వాత అతను చిన్న రోల్ ఉంది చేస్తారా? అని అడిగారు. రెండు మూడు ఫ్రేమ్స్​లో కనిపిస్తారు. డైలాగ్స్ ఏముండవు అని చెప్పారు. అదే లోక్ పాల్ సినిమా. అలా నా సినిమా జర్నీ మొదలైంది. 

సినిమాల్లోకి రావడం అంత ఈజీ కాదు. చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నా. నేను ఎంచుకున్న దారి సరైనదేనా? కాదా? అని. అయినప్పటికీ ఎక్కడా ఆగలేదు. 2015లో కేరళ స్టేట్ అవార్డ్​ వచ్చాక యాక్టింగ్​ని సీరియస్​గా తీసుకున్నా. దీన్ని నా లైఫ్​లాంగ్ కంటిన్యూ చేయాలని బలంగా అనుకున్నా. ఆడిషన్స్ ద్వారా ‘టేక్​ ఆఫ్’​ సినిమాకి సెలక్ట్ అయ్యా.‘టేక్​ ఆఫ్​’ తర్వాత యాక్టింగ్​ని లోతుగా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. పాండిచ్చేరి లోని ఆదిశక్తి థియేటర్​ గ్రూప్​లో చేరి యాక్టింగ్​ వర్క్​షాపులకు వెళ్లా. అక్కడే యాక్టింగ్​ గురించి చాలా నేర్చుకున్నా. అక్కడి నుంచి నా కెరీర్​ కూడా టేక్​ ఆఫ్​ అయింది. 

అను పాత్ర ఎలా వచ్చిందంటే.. 

కాస్టింగ్ డైరెక్టర్ ప్రణవ్​ రాజ్ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’​ సినిమాలో ప్రభ పాత్రకు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. ‘అరియప్పు’ సినిమాలో నేను నటించిన రేష్మి పాత్రకు, ఈ మూవీలో ప్రభ రోల్​కి దగ్గరి పోలికలు ఉన్నాయి. నిజానికి ఆ క్యారెక్టర్ చూసే ఈ పాత్ర ఆడిషన్​ చేయమని అడిగారని నాకు కూడా తెలుసు. అయితే ముంబైలో సెకండ్ రౌండ్ ఆడిషన్ పూర్తయ్యాక,  డైరెక్టర్ పాయల్ నన్ను అను పాత్రకు ఆడిషన్ చేయమన్నారు.

 దాంతో అందులో నాలుగు రౌండ్స్​లోను నేను సెలక్ట్ అయ్యా. అయితే నేను ఈ స్క్రిప్ట్​ ఒప్పుకోవడానికి కారణం మాత్రం డైరెక్టరే. స్క్రిప్ట్​ అంతా చదివాక, ప్రభ లేదా అనులో ఏ పాత్ర చేయాలి అనేదానికంటే ఇలాంటి డైరెక్టర్​, కన్విన్సింగ్​గా రాసుకున్న ఈ కథను మిస్సవ్వద్దు అనుకున్నా.. అదే ఆమెతో కూడా చెప్పా. పాత్ర ఎందుకు మార్చారు? అని అడిగితే.. నీలో చిన్నపిల్లల మనస్తత్వం కనిపించింది. అది ఈ క్యారెక్టర్​కి పర్ఫెక్ట్​గా సూట్ అవుతుందని చెప్పారు. అలా నేను ఈ సినిమాలో అను పాత్రలో నటించా. ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో చాలామంది ఆడవాళ్లమే ఉన్నాం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల అక్కడి వాతావరణం అంతా పాజిటివ్​గా ఉండేది. క్రియేటివిటీకి ఆడ, మగా అనే తేడా ఉండదు. అందరం కలిసి పనిచేస్తాం. 

సినిమా కెరీర్ ఇలా

2013లో ‘లోక్​పాల్’ అనే సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2017లో టేక్​ ఆఫ్​, 2019లో తమాషా సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ టైంలోనే అరియప్పు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఇంటర్నేషనల్​ కాంపిటీషన్స్​కు కూడా వెళ్లింది. 2022లో ‘ఈశ్వరన్​ సక్శియాయ్’ సినిమాను వరల్డ్ ప్రీమియర్​గా ప్రదర్శించారు. ఇప్పుడు ‘ఆల్​ వి ఇమాజిన్ యాజ్ లైట్’​ అనే సినిమాలో అను పాత్రలో నటించింది. 

ఆ సినిమా గత ఏడాది కేన్స్ ఫెస్టివల్​లో ప్రదర్శన కూడా జరిగింది. ఎన్నో ఇంటర్నేషనల్​ అవార్డ్​లకు నామినేట్ అయింది. కొన్నింటినీ ఆల్రెడీ సొంతం చేసుకుంది. మరికొన్ని ఈ ఏడాది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా డైరెక్టర్ పాయల్​ కపాడియాకు కూడా ఎన్నో అవార్డులు వరించాయి. ఇలా తాను చేసిన సినిమాలన్నీ నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్​గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అందుకే ఆమె ఇంటర్నేషనల్​ నటి.  

సీరియల్స్ వద్దనుకున్నా

సీరియల్స్ మాత్రం చేయాలనుకోలేదు. మన కళను అనేక రకాలుగా చూపించడానికి టీవీలో పెద్దగా స్కోప్ ఉండదు అనిపించింది. పైగా సినిమాల్లో చిన్నవో, పెద్దవో వరుసగా ఆఫర్లు వచ్చేవి. దాంతో సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యా. అయితే ఎప్పుడూ నేను కోరుకునేది ఒక్కటే.. ఫుల్​ లెంగ్త్ ఉండే రోల్ నాకు రావాలి అని. అప్పుడే నా టాలెంట్​ చూపించే అవకాశం దొరుకుతుంది అనుకుంటా. ‘అరియప్పు’ (డిక్లరేషన్) తర్వాత నుంచి ఒక క్యారెక్టర్​కి ఎలా ప్రిపేర్​ అవ్వాలి? అనేది నేర్చుకున్నా. అలా ప్రతి ప్రాజెక్ట్​ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నా. ముఖ్యంగా ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’​  సినిమా చేసేటప్పుడు చాలా నేర్చుకున్నా. ఇలాంటివే కాకుండా కమర్షియల్ సినిమాల్లోనూ నటించాలనుంది. ప్రస్తుతం దానిమీదే ఫోకస్ చేశా’’.