
96’ సినిమాలో టీనేజీ ‘జాను’గా నటించిన అమ్మాయనగానే.. అమాయకత్వంతో కూడిన అందమైన ముఖం కళ్లముందుకొస్తుంది. ఆ ఒక్క సినిమాతో ఆడియెన్స్ మనసు దోచేసింది. ఆ పాత్ర ఎంత గుర్తింపు తెచ్చుకుందంటే.. తెలుగులో చేసిన రీమేక్‌కి ‘జాను’ అనే టైటిల్ పెట్టేంతగా! ఈ రెండు సినిమాల్లోనూ ‘జాను’గా అలరించిన నటి ఎవరో కాదు.. మలయాళీ అమ్మాయి గౌరీ జి. కిషన్. ఆ సినిమాల తర్వాత తన యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగిస్తోంది. లేటెస్ట్గా మలయాళంలో ‘లవ్ అండర్ కన్స్ట్రక్షన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ దక్షిణాది భాషల్లో ఈ నెల 28వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గౌరీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి.
అది నా డ్రీమ్ రోల్
‘‘రియల్ లైఫ్ క్యారెక్టర్ లేదా బయోపిక్ ప్రాజెక్ట్స్‌లో నటించాలనేది నా డ్రీమ్. ఒక యాక్టర్‌గా ఆ క్యారెక్టర్లో లీనమై చేయడం వేరు.. అదే నిజజీవితంలో ఉన్న వ్యక్తిని చూస్తూ వాళ్ల బాడీ లాంగ్వేజ్, యాస, భాష, కట్టూబొట్టూ.. అవన్నీ అలవరచుకుని.. ఒక పాత్ర పోషించడం అనేది చాలా సవాలుతో కూడుకున్న విషయం. అలాంటి పాత్రలకు నేను సరిపోతానో లేదో తెలియదు. కానీ భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తుందేమో చూడాలి.’’
తెలుగులో మొదటిసారి..
‘‘96’’ తర్వాత నాకు అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. అయితే ‘శ్రీదేవి – శోభన్ బాబు’ స్క్రిప్ట్ విన్నాక కొంచెం కొత్తగా అనిపించింది. నేను చాలా తెలుగు సినిమాలు చూశాను. అందులో ఉన్నట్టుగానే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అన్ని అంశాలు ఉన్నాయనిపించి ఈ కథ ఓకే చేశా. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘శ్రీదేవి’. రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది.’’
అంతలో లాక్ డౌన్!
‘‘96’’ తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. ఆ సినిమా విడుదలయిన మరుసటి ఏడాది మలయాళం సినిమా ‘మర్గమ్కలి’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చా. తెలుగు, తమిళంలో రెండేసి సినిమాలు చేశా. అయితే అప్పటికీ నేను చదువుకుంటున్నాను. కాబట్టి అటెండెన్స్‌కి ఇబ్బంది కలగకూడదని నిర్ణయించుకున్నా. దాంతో షూట్ మధ్యలో కాలేజీకి వెళ్తూ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. చదువు అయిపోయింది కదా ఇక నా టైం అంతా సినిమాలకే కేటాయించాలి అనుకున్నా.
అంతలో లాక్ డౌన్ జరిగింది. అప్పుడు నా మైండ్‌లో సినిమాని కెరీర్‌గా ఎంచుకోవాలా? లేక చదువునా? అనే ఆలోచనలు తిరుగుతున్నాయి. లక్కీగా లాక్డౌన్ తీసేయగానే నాకు మళ్లీ అవకాశాలు వచ్చాయి. ఆడియెన్స్ నన్ను యాక్టర్‌గా చూడాలనుకుంటున్నారని నాకు నమ్మకం కలిగింది. కొవిడ్ టైంలో స్క్రీన్ రైటింగ్ కోర్స్ కూడా చేశా. ఎందుకంటే కెమెరా వెనక ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. దానివల్ల నేను ఇంకా బాగా పర్ఫార్మ్ చేయగలను అనుకునేదాన్ని. అంతేకాదు.. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తానో అనే భయంతో నన్ను నేనే విమర్శించుకుంటా” అని చెప్పింది.
ప్రశాంతతను కాపాడుకోవాలి
‘‘సినిమా అనేది నా ప్రొఫెషన్. నా ఆలోచనా ధోరణి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి విషయం ఏదైనా పూర్తిగా తెలియకుండా, తెలుసుకోకుండా నేను మాట్లాడను. పాపులారిటీ ఉంది కదా అని సోషల్ మీడియాలో జరిగే వాటన్నింటికీ నేను స్పందించను. ఈరోజుల్లో ఎంతో సమాచారం మనముందు ఉంటుంది. ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. కానీ దేని గురించైనా మాట్లాడాలంటే నాకు కావాల్సిన టైం నేను తీసుకుంటా. నాకు వీలైనంతవరకు నా చుట్టూ ఉన్న ప్రశాంతతను కాపాడుకుంటా.
నా వాళ్లతో ఉంటే నేనెప్పుడూ స్థిరంగా ఉంటా. అలాగే.. సినిమా విషయానికొస్తే.. అదొక ప్రయాణం. ఏడాదిపాటు ఒక టీంతో కలిసి పనిచేస్తాం. రిజల్ట్ లాగే సినిమా జరిగే ప్రాసెస్ కూడా ముఖ్యమైనదే. సినిమా బాగా వస్తుంది అనిపించినప్పుడు ఒక పర్సన్‌గా ఇంప్రూవ్ అవుతాం. చేస్తున్న ప్రాజెక్ట్ చిన్నదైనా, పెద్దదైనా సంతృప్తి చెందాలి. శాటిస్ఫ్యాక్షన్ లేదంటే మన మైండ్ సరిగా లేనట్టే. అందుకే మన ప్రశాంతతను మనమే కాపాడుకోవాలి.’’