పరిచయం : సక్సెస్  నా బుర్రకి  ఎక్కదు

పరిచయం : సక్సెస్  నా బుర్రకి  ఎక్కదు

నిఖిలా విమల్ మలయాళీ నటి. అయినా.. తమిళ భాష అంటే ఎంతో ప్రేమ. డబ్బింగ్ సినిమాలతో తెలుగువాళ్లకు పరిచయమై టాలీవుడ్​లో కూడా నటించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేండ్లకు పైనే. కానీ నటించిన సినిమాలు మాత్రం 20 పైగా ఉంటాయేమో. రీసెంట్​గా మలయాళ డబ్బింగ్ సినిమా ‘గురువాయూర్ అంబలనాడయిల్’లో పృథ్విరాజ్​కి భార్యగా పార్వతి అనే పాత్రలో నటించింది. ఆ సినిమా మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాల్లో జర్నీ గురించి నిఖిల మాటల్లోనే... 

‘‘మాది కేరళ, కన్నూర్ జిల్లాలోని తలిపరంబ అనే ఊరు. నాన్న ఎం.ఆర్. పవిత్రన్. స్టాటిస్టికల్ డిపార్ట్​మెంట్​లో జాబ్​ చేసి రిటైర్ అయ్యారు. అమ్మ పేరు కలమందలం విమలాదేవి.. తను డాన్సర్. నాకు ఒక అక్క ఉంది. తనపేరు అఖిలా విమల్. థియేటర్ ఆర్ట్స్​లో రీసెర్చ్ స్కాలర్ అక్క. నా విషయానికి వస్తే... భరతనాట్యం, కూచిపూడి, కేరళ నటనం, మోనో యాక్టింగ్​​ నేర్చుకున్నా. చదువుకునే రోజుల్లో యూత్ ఫెస్టివల్స్​లో వాటిని ప్రదర్శించేదాన్ని. చదువు విషయానికొస్తే.. 2016లో బీఎస్సీ బోటనీ చేశా. డాన్సర్​ని కావడం వల్ల స్టేజీ ఫియర్ ఉండదు నాకు.

చైల్డ్ ఆర్టిస్ట్​గా...

మొదట్లో షాలోమ్​ టీవీలో డాక్యుమెంటరీ సిరీస్​ల్లో నటించా. ఎనిమిదో తరగతిలో ‘భాగ్యదేవత’ అనే సినిమాలో హీరో జయరాంకి చెల్లెలిగా చేశా. 2015లో ‘లవ్​ 24/7’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. 2016లో ‘వెట్రివేల్’ అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చా. అలా వెంటవెంటనే రెండు భాషల్లో నటించే అవకాశం దక్కింది. అయితే సినిమాలో నటించడం సరదాగా ఉంటుందని నేను చేయలేదు.

ఆ సినిమాలో నేను చేయాలని మా అమ్మానాన్న అనుకున్నారు. నాకు అవకాశం వచ్చింది.. కానీ ఆ టైంలో సినిమాల గురించి నాకు అంతగా అవగాహన లేదు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. కానీ ఇప్పుడు ఇదే నాకు సీరియస్‌‌ కెరీర్‌‌. నా ఫుల్​ టైం జాబ్​ ఇదే. యాక్టింగ్​ ఒక్కటే కాదు మొదట్నించీ నా సినిమాలన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా. నేను మలయాళీనైనా.. తమిళంలో నేను నటించిన సినిమాలకు కూడా నేనే డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు నాకు తమిళం చాలా బాగా వచ్చు. తమిళం మీద నాకు ఉన్న ఇష్టంతో చదవడం, రాయడం కూడా నేర్చుకున్నా.

పొర్ తొళిల్ విశేషాలు

మలయాళం సినిమాల్లో చేసేటప్పుడు పొద్దున ఏడింటికి వెళ్లి రాత్రి తొమ్మిదింటికి వచ్చేదాన్ని. డైలీ నా షెడ్యూల్​ అలానే ఉండేది. తమిళ సినిమాల్లో చేసేటప్పుడు సాయంత్రం ఆరు గంటలకల్లా షూటింగ్​ ప్యాకప్ అయిపోయేది. దానివల్ల కాస్త రెస్ట్ దొరికేది. కానీ ‘పొర్ తొళిల్’ మూవీకి మాత్రం టైమింగ్స్ అన్నీ మారిపోయాయి. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యేదే సాయంత్రం ఆరు గంటలకు. ప్యాకప్ అయ్యేసరికి ఉదయం ఆరు గంటలు అయ్యేది. ఆ తర్వాత రెస్ట్ తీసుకుందామంటే నిద్రపట్టదు. రాత్రిపూట షూటింగ్ ఉన్నప్పుడు నిద్ర సరిపోక నా హెల్త్​ మీద ఎఫెక్ట్ పడింది.

మొదటి షెడ్యూల్​ తర్వాత బ్రేక్​లో రెండు రోజులు హాస్పిటల్​లో చేరా. అప్పుడు ఆ విషయం నేనెవరికీ చెప్పలేదు. అయితే ఒకసారి నా హెల్త్​ బాగాలేదనే విషయం డైరెక్టర్ గమనించారు. అయినా నేను నోరు తెరిచి ‘నాకు బాగాలేదు’ అని చెప్పలేదు. ఎందుకంటే అప్పటికే టీంలో చాలామందికి ఆరోగ్యం బాగాలేదు. అందరం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా షూటింగ్ పూర్తి చేశాం. అదొక్కటే కాదు.. అలా  పది సినిమాలకు రాత్రి పూట షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే  సినిమా షూటింగ్ వల్ల  నిద్ర వేళల్లో మార్పు వచ్చింది. ఆర్. శరత్ కుమార్, అశోక్ సెల్వన్​తో కలిసి15 రోజులు షూటింగ్​ చేశా.  

అప్పుడు వాళ్లతో కనెక్ట్​ అవ్వలేదు. కానీ, ప్రమోషన్స్​ టైంలో అందరితో కలిసి సరదాగా గడిచింది. అప్పుడు మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు మా అందరికీ కలిపి ఒక వాట్సాప్​ గ్రూప్ కూడా ఉంది. చెన్నయ్​ వెళ్లినప్పుడల్లా వాళ్లని కలుస్తా. మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. 
పొర్ తొళిల్ కంటే ముందు మలయాళంలో ఒక థ్రిల్లర్ మూవీ చేశా. దాని పేరు ‘అంజామ్​ పాతిరా’. ఆ సినిమా కోసం నేను సగం రోజు కేటాయించానంతే. సినిమాలో కూడా ఒక్కసారి మాత్రమే కనిపిస్తా. కానీ, ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేను. అయితే, ఆ సినిమాను ‘పొర్​ తొళిల్’​తో పోల్చలేం. రెండూ థ్రిల్లర్స్ అయినప్పటికీ వేటికవే భిన్నంగా ఉంటాయి. 

చేదు అనుభవాలు

ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ, నా ట్రావెలింగ్ అంతా షూటింగ్ లొకేషన్స్​కి తిరగడంలోనే అయిపోతుంది. తమిళ సినిమా ‘రంగ’ ఒప్పుకోవడానికి ట్రావెలింగ్ కూడా ఒక కారణం. ఆ సినిమా షూటింగ్ కశ్మీర్​లో ఉంటుందని చెప్పారు. కశ్మీర్ పేరు చెప్పగానే మంచు పర్వతాలు, ప్రకృతి.. నా కళ్ల ముందు కదలాడాయి. తీరా అక్కడికి వెళ్లాక స్టన్​ అయ్యా. మేం వెళ్లిన టైంకి అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది. ఎముకలు కొరికే చలి. బయటకు కూడా రాలేకపోయాం. ‘నన్ను ఇంటికి పంపించేయండి’ అని మొత్తుకున్నా.

అలాంటి పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరిగింది. ప్రతి రోజూ కెమెరా డ్యామేజ్ అయ్యేది. షూటింగ్​ చేసే ప్రాంతంలో కర్ఫ్యూ ఉంది. ఇంటర్నెట్ కూడా బ్యాన్​. అదొక నరకంలా అనిపించింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా కశ్మీర్ ట్రిప్​కి వెళ్లి ఫొటోస్​ షేర్​ చేస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి కూడా జరిగింది.

దుల్కర్ నటించిన ‘ఒరు యమదాన్ ప్రేమకథ’ అనే సినిమా షూటింగ్ బ్యాంకాక్​లో జరిగింది. అది మూవీలో డ్రీమ్​ సీక్వెన్స్​. బ్యాంకాక్ వెళ్తున్నానని చాలా ఎగ్జయిట్​ అయ్యా. కానీ, లొకేషన్​ బ్యాంకాక్​ నుంచి తమిళనాడులోని పొల్లాచికి మారిందని చెప్పారు. ఆ తర్వాత ఊటీ, కొడైకెనాల్ అన్నారు. చివరికి ఆ షూటింగ్​ కొట్టాయంలో మిట్ట మధ్యాహ్నం వేళ జరిగింది. 

పదిహేనేండ్ల కెరీర్​లో...

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేండ్లు దాటింది. కానీ, చేసిన సినిమాలు మాత్రం 20 పైన ఉంటాయంతే. అందులో నా పాత్రకు తగినంత ప్రాధాన్యత లేకపోతే, ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోను. నెరేషన్ విన్నాక, స్క్రిప్ట్ చదువుతా. కొన్నిసార్లు మాత్రం ప్రొడక్షన్ హౌస్, స్టార్ కాస్ట్ వంటి వాటిని బట్టి మంచి పాత్రలు అయితేనే ఎంచుకుంటా. ఇప్పటివరకు నా కెరీర్​లోనే చాలామంది సీనియర్​ నటులతో కలిసి పనిచేశా. స్టార్స్ అనే ట్యాగ్ వాళ్ల కష్టానికి దక్కిన ఫలితమే అనిపిస్తుంది. 
సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు మంచికే.

ఇప్పుడు అందరం పాన్​ ఇండియా అంటున్నాం. దానివల్ల బిజినెస్​ మార్కెట్ విధానంలో మార్పులు వచ్చాయి. అయితే నటీనటులకు ఇది చాలా మంచి అవకాశం. అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం అవుతాం. ఓటీటీ వల్ల కూడా నటులందరికీ మేలే జరిగింది. మాకు పని పెరిగింది.. మేం చేస్తున్న పని అందరికీ కనిపిస్తోంది. వినడానికి వింతగా అనిపించినా.. మీకో విషయం చెప్తా. అదేంటంటే.. సినిమా సక్సెస్​ను అంగీకరించడం చాలా కష్టం నాకు. ఎందుకోగానీ సక్సెస్​ను తీసుకోవడం తెలియదు. నా సినిమా హిట్​ అని తెలిసినా దాన్ని నేను తలకి ఎక్కించుకోను. ఫ్యూచర్​లో కామెడీ సినిమాలతో పాటు నెగెటివ్​ పాత్రల్లో కూడా చేయాలని ఉంది” అంటూ తన పదిహేనేండ్ల సినిమా జీవితం గురించి చెప్పింది. 

డైలీ రొటీన్

ఉదయం లేదా సాయంత్రం ప్రతి రోజు ఒక గంట జిమ్​లో వర్కవుట్స్ చేస్తా. నిజానికి నాకు మెషిన్ వర్కవుట్ కంటే కార్డియో వర్కవుట్ ఇష్టం. షూటింగ్​లో ఉన్నప్పుడు వర్కవుట్ సెషన్​కి ఆటంకం ఏర్పడుతుంది. అందుకని ఫిట్​గా ఉండటానికి డైట్​ కరెక్ట్​గా చూసుకుంటా.

తెలుగులో ‘మేడ మీద అబ్బాయి’ (2017) సినిమాతో డెబ్యూ. తర్వాత మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ సినిమాలో నటించా.
మాతగం’ అనే తమిళ వెబ్ సిరీస్​లో, ‘పెరిళ్లూర్ ప్రీమియర్​ లీగ్’ అనే మలయాళ సిరీస్​లో కూడా చేశా. మరొక మలయాళీ వెబ్​ సిరీస్​ త్వరలో వస్తోంది. 
రీసెంట్​గా ‘గురువాయూర్ అంబలనాడయిల్’ అనే సినిమాలో  నటించా. అందులో నాది ఇంపార్టెంట్​ రోల్​. సినిమా అంతా కామెడీగా ఉన్నా.. నా పాత్ర మాత్రం సీరియస్​గా ఉంటుంది.