మలయాళ నటుడు ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly) పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. సినిమాలో అవకాశం ఉందని..ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటూ తనను దుబాయ్ తీసుకెల్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆరుగురు వ్యక్తులపై దాఖలైన ఈ కేసులో హీరో నివిన్ పౌలీ పేరును ఆరో నిందితుడిగా చేర్చారు.
అంతేకాకుండా ఈ కేసులో మొదటి నిందితురాలిగా శ్రేయ అనే అమ్మాయి పేరును చేర్చారు పోలీసులు. నిర్మాత ఎ.కె. సునీల్ రెండో నిందితుడుగా గుర్తించారు. కొత్తమంగళం ఒనుంకల్ పోలీసులు..నివిన్ పౌలీపై అత్యాచారం, మహిళలను అవమానించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 376, 354, 376డీ సెక్షన్లు విధించారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన లైంగిక దుష్ప్రవర్తన ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారించనుంది. ఇక ఈ ఘటన విదేశాల్లోనే జరిగిందని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే తనపై నమోదైన కేసు గురించి హీరో నివిన్ పౌలీ స్పందించారు. తాజాగా తనపై వచ్చే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని..నాపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోండి అంటూ నివిన్ ఇంస్టాగ్రామ్ ద్వారా నోట్ పోస్ట్ చేశారు.
”ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నాపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తిగా అవాస్తవం. నాపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోండి. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు నేను కచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. అలాగే ఇందుకు కారకులు అయిన వారిని వెలుగులోకి తీసుకువస్తాను. అలాగే వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను. నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగిలినవి చట్ట ప్రకారం పరిష్కరించబడతాయి” అంటూ ఇన్స్టా లో పేర్కొన్నారు.
హీరో నివిన్ పౌలీ మలయాళ బ్లాక్ బాస్టర్ మూవీ ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఏడాది మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాలో నటించాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది.