ఏడాది క్రితం మీటూ, కాస్టింగ్ కౌచ్ అనే పదాలు సినిమా రంగాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాలు ఊరికే రావని.. ఎదుటి వారిని సంతోష పరిస్తేనే అవకాశాలు వస్తాయని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే మాట్లాడారు. కొన్నాళ్లు ఆ పదాలు బాగా వినిపించాయి. తరువాత రోజులు గడిచే కొద్దీ రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో అవి కామన్ అన్నట్టుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆ ఉద్యమం నీరుగారిపోయింది. తాజాగా, కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు మరోసారి మొదలయ్యాయి.
మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు జస్టిస్ హేమ కమిటీ బయట పెట్టడంతో కొందరు హీరోయిన్లు మరోసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పుతున్నారు. పలువురు తారలు తమకు ఎదురైన పరిస్థితుల గురించి ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్.. సీనియర్ నటుడు సిద్ధిఖపై సంచలన ఆరోపణలు చేసింది. సిద్ధిఖీ తనను బలవంతంగా గదిలో బంధించి అనుభవించాడని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు మాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతోన్నాయి.
అప్పుడు నేను ఇంటర్ చదువుతన్నా..
నేను 10+2 చదువుతున్న సమయంలో నటుడు సిద్ధిక్‌తో పరిచయం ఏర్పడింది. అతను నకిలీ ఖాతా నుండి నాకు మెసేజ్‌లు పంపేవాడు. నన్ను కూతురులా సంబోధించేవాడు. కొన్నాళ్లకు నాకు నటనపై ఆసక్తి ఉందని తెలిశాక ఒక మూవీ ప్రీమియర్ షోకు రమ్మని ఆహ్వానించాడు. నేను ప్రివ్యూ చూడటానికి అతని ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులకు కూడా నాతో ఉన్నారు. మొదట్లో అంతా ప్రొఫెషనల్‌గా అనిపించింది.
అలా కొన్నిసార్లు చర్చలు జరిగిన అనంతరం అకస్మాత్తుగా అతని సంభాషణ లైంగికంగా మారింది. అది ఒక ఉచ్చు అని నేను గ్రహించాను. కానీ అప్పటికి నేను సాయం పొందలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. నా సమ్మతి లేకుండానే అన్నీ చేశాడు. అవకాశాలు కావాలంటే తనతో ప్రతిసారి పడుకోవాలని చెప్పేవాడు. అందరూ ఇలా పైకొచ్చిన వారేనని, సియగు పడకుండా పక్క పంచుకోవాలని సూచించేవాడు. తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడిచేశాడు. ఆరోజు హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను. " అని నటి రేవతి సంపత్ ఆరోపించింది.
#WATCH | Actress Revathy Sampath alleges, " I got in contact with actor Siddique during my 10+2 time. He used to message me from an account that looked fake and he was in contact with me for 2 years and used to address me as ‘daughter’. He got to know that I am interested in… pic.twitter.com/VdKaq24sZB
— ANI (@ANI) August 25, 2024
రేవతిపై పోలీసులకు ఫిర్యాదు
తనపై లైంగిక ఆరోణలు చేసిన నటి రేవతి సంపత్‌పై నటుడు సిద్ధిక్ కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్‌కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. రేవతి తనపై తప్పుడు ఆరోపణలు చేసి, నష్టపరిచేలా ప్రచారం చేస్తోందని సిద్ధిక్ ఆరోపించారు. 2016 ప్రారంభంలో సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆమెను ఒక్కసారి మాత్రమే కలిశానని, అలాంటి సంఘటనేమీ జరగలేదని పేర్కొన్నాడు.