మార్చి 15 లోపు భారత సైన్యం వెళ్లిపోవాలి: ముయిజ్జు

మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు  ఇండియాకు డెడ్ లైన్ విధించారు. మార్చి 15 కల్లా  భారత సైన్యం తమ దేశం విడిచి వెళ్లాలని కోరారు. గతేడాది నవంబర్ లో జరిగిన  అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన  ముయిజ్జు  చైనాలో తొలిసారి పర్యటించి ఆదేశ అధ్యక్షుడు  జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఆ దేశంతో పలు ఒప్పందాలను చేసుకున్నారు. జనవరి 13న స్వదేశానికి తిరిగి వచ్చిన  ముయిజ్జు ఈ ప్రకటన చేయడం గమనార్హం. మాల్దీవుల్లో భారత సైనికులు ఉండకూడదనేది  ముయిజ్జు పాలసీ అని ఆ దేశ ప్రెసిడెంట్స్ ఆఫీస్ తెలిపింది. 

భారత సైన్యాన్ని వెనక్కి పంపాలన్న అభ్యర్థనపై ఆదివారం ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. మార్చి 15 నాటికి భారత సైనికులు తమ దేశం నుంచి విడిచి వెళ్లాలని తమ అధ్యక్షుడు చెప్పినట్లు మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్ కు తెలిపారు. చైనాకు దగ్గరవుతున్న మాల్దీవులు భారత్ తో సంబంధాలను తెంచుకోవాలని చూస్తోంది. 

ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులు ఉన్నారు.  వీరు రాడర్లు నిర్వహణ, విమానాలపై నిఘా వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మాల్దీవులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి భారత్ తో సత్సంబంధాలను  కలిగి ఉంది. ఈ క్రమంలో భద్రత విషయంలోనూ భారత ఆర్మీ సాయం తీసుకుంది. విదేశీ సైన్యాన్ని దేశం నుంచి తరిమేస్తామని గతేడాది  అధ్యక్షుడు ముయిజ్జు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ దేశ నేతల వ్యాఖ్యలు భారత్ తో సంబంధాలను దెబ్బతీశాయి.