భారత్ జెండాని అవమానించిన.. మాల్దీవ్ మాజీ మంత్రి క్షమాపణలు

అన్ని విషయాల్లో చైనాకి దగ్గరవుతూ మాల్దీవ్ కంట్రీ భారత్‍ని దూరం పెడుతున్న విషయం తెలిసిందే. భారత వ్యతిరేక, చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ భారత వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు. అయినప్పటికీ భారత్ మాల్దీవులకు వస్తువులను ఎగుమతి చేసేందుకు ముందుకొచ్చింది. దీనికి మాల్దీవులు ధన్యవాదాలు కూడా తెలిపింది. అది జరిగిన రెండు రోజులకే  ఆ దేశ మాజీ మంత్రి మరియం షియునా మరో వివాదానికి తెరతీశారు. భారతదేశ జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని అవమాన పరిచింది.

సస్పెండ్ అయిన మాల్దీవుల మంత్రి మరియం షియునా భారత జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో మరియం షియునా క్షమాపణలు చెప్పి వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. మాల్దీవుల్లో మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు భారత త్రివర్ణ పతాకంపై అశోక చక్రం స్థానంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఉంచి మరియం షియునా సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో చాలామంది సీరియస్ అయ్యారు.  వెంటనే ఆమె ఆ పోస్ట్ డిలెట్ చేసి ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు.