
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏఏపీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఐఆర్డీ సౌజన్యంతో 28 మంది మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం 14 రోజుల శిక్షణలో భాగంగా మూడు రోజుల పాటు మండలంలో పర్యటిస్తుందని తెలిపారు. అనంతరం బృందం సభ్యులు ప్రభుత్వం అందించే పథకాలు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయనే విషయాలను తెలుసుకున్నారు.
ముల్కనూరులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ద్వారా నిర్మించిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, పల్లె ప్రకృతి వనం ద్వారా మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. రైతులకు సేవలు, మాత శిశు సంరక్షణపై అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల పాటు బృందం సభ్యుల పర్యటన కొనసాగనున్నది. కార్యక్రమంలో మాల్దీవుల ట్రైనర్ హుస్సేన్ వాది, అడ్మిన్ ఆఫీసర్ ఈమా, ఎన్ఐఆర్డీ కో ఆర్డినేటర్ అరుణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.