కేజీబీవీలోకి మేల్ ఆఫీసర్లు.. ప్రిన్సిపాల్ తీరుపై పేరెంట్స్ ఆందోళన

  • నిర్మల్ జిల్లా కుభీర్ లో స్కూల్ వద్ద ఘటన

కుభీర్, వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ)లోని విద్యార్థినుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. స్కూల్ లోకి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదనే నిబంధనను ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదు. ఇందుకు కుభీర్ కేజీబీవీ స్కూల్ నిదర్శనంగా నిలుస్తోంది. సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని శుక్రవారం విద్యార్థులను తీసుకెళ్లేందుకు కొందరు పేరెంట్స్ వెళ్లారు. వారి ముందే కొందరు మేల్ ఆఫీసర్లు స్కూల్ లోకి వెళ్లి చాలా సేపటి తర్వాత బయటకు వచ్చారు. ఇది చూసిన పేరెంట్స్ వారు ఎవరు..? ఎందుకు స్కూల్ లోనికి వెళ్లారు.? అని ప్రిన్సిపాల్ వాణిని ప్రశ్నించారు.

దీంతో స్పెషల్ ఆఫీసర్స్ అని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.  ఎందరు స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారని మరోసారి ప్రశ్నించగా ఒకరే ఉంటారని సమాధానం దాటవేశారు. దీంతో అనుమానించి కొంతసేపు పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో వారిని ప్రిన్సిపాల్ సముదాయించటం గమనార్హం. గతంలో కూడా ప్రిన్సిపాల్ స్కూల్ లోనే  ప్రైవేట్ కాలేజీ అధ్యాపకులతో సుదీర్ఘ చర్చలు చేసినట్టు వార్తల్లోకి ఎక్కారు. మొదట్నుంచి కుబీర్ కేజీబీవీ ప్రిన్సిపాల్ తీరుపై పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల వద్దకు పేరెంట్స్ వస్తేనే ఆంక్షలు పెట్టే ప్రిన్సిపాల్.. ప్రైవేటు వ్యక్తులను లోనికి పంపడం వెనక ఆంతర్యమేంటని  పేరెంట్స్  చర్చించుకున్నారు. ఏడాది కాలంగా స్కూల్ లో  సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో లోపలికి ఎవరు వెళ్లాలనేది ప్రిన్సిపాల్ నే డిసైడ్ చేస్తున్నారు.   మండల విద్యాధికారిని ఫోన్ చేసి ప్రశ్నించగా కలెక్టర్ స్పెషల్ ఇన్ చార్జ్ గా అధికారి శివను నియమించినట్లు తెలిపారు. మిగతావారు అతని ఫ్రెండ్స్ అయి ఉండొచ్చని చెప్పారు.