- పక్కా ప్లానింగ్ తో బోనులో బంధించిన మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు
- శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలకు సీసీఎంబీ ల్యాబ్ కు పంపించగా..
- మగ పులినే దాడులు చేసినట్టు ఫారెస్ట్ ఆఫీసర్లకు అందిన రిపోర్ట్
ఆసిఫాబాద్/కాగజ్ నగర్: తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో అలజడి రేపిన పెద్దపులుల్లో.. గత నెల31న బోనులో చిక్కిన మగ పెద్దపులినే దాడులకు పాల్పడినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇటీవల రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో సంచరిస్తూ వరుస దాడులతో ప్రజలను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ అధికారులు నిత్యం ట్రాకింగ్ చేసి శాంపిల్స్ సేకరించారు. ఆడ తోడు కోసం తిరిగే క్రమంలోనే మగ పులి దాడులు చేసినట్లు అధికారులు, నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత ప్రజల ప్రాణాలకు హాని కలగకుం డా పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. చిక్కిన మగపులినే దాడులు చేసినట్టు సీపీఎంబీ రిపోర్ట్ ద్వారా నిర్ధారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సీసీఎంబీ రిపోర్ట్ తో కన్ఫర్మ్..
తెలంగాణలో జరిగిన రెండు ఘటనల తర్వాత సిర్పూర్ టీ రేంజ్ గుండా మహారాష్ట్రకు అనుసంధా నమై అడవిలో పులి సంచారం, పశువుల మీద దాడులు రెగ్యులర్ గా జరిగాయి. పులులు ఎక్కువగా ఉండే తడోబా, అంధేరీ టైగర్ రిజర్వ్ లోనూ వరుస పులి దాడులు ఫారెస్ట్ అధికారులను కలవర పెట్టాయి. మహారాష్ట్రలో డిసెంబర్ 21 న ఇద్దరిని చంపేశాయి. దీంతో అలర్ట్ అయిన అక్కడి అధికారులు దాడి చేసిన పులిని పక్కా ప్లానింగ్ తో బోనులో బంధించారు. దాడిచేసిన సమయంలో.. చిక్కిన పులి శాంపిల్ కలెక్ట్ చేశారు. బంధించిన మగపులి దాడి చేసిన చోట లభించిన దాని వెంట్రుకల ఆధారంగా డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి. దీంతో దాడి చేసినది ఓకే పులిగా నిర్ధారించారు.
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) నుంచి మగ పులి చెందిన రిపోర్ట్ ఇటీవల చంద్రాపుర్, తడోబా ఫారెస్ట్ అధికారులకు అందింది . పులికి మూడేండ్ల వయసు ఉంటుందని, సాధారణ స్వభావానికి భిన్నంగా అగ్రెసివ్ గా వ్యవహరిస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించినట్లు సమాచారం. మగ పులిని మహారాష్ట్రలోని జూ కి తరలించేందుకు తాడోబా టైగర్ రిజర్వ్ అధికారులు అక్కడి ఫారెస్ట్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఇకపై పులిని అడవిలో వదిలే చాన్స్ లేదని ఫారెస్ట్ ఆఫీసర్ల సమాచారం.
దీనిపై ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ను సంప్రదించగా మహారాష్ట్రలో చిక్కిన మగ పులి శాంపిల్ రిపోర్ట్ వచ్చినట్లు మహారాష్ట్ర అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాగజ్ నగర్ డివిజన్ లో ఇద్దరి మీద దాడి చేసిన పులి ఇదేనని నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. ఇకపై పులి మనుషుల మీద దాడి చేయకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
తగ్గిన పెద్దపులి అలజడి
గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కాగజ్ నగర్ ఫారెస్ట్ లో ప్రజలను, అధికారులను హడలెత్తించిన మగ పులిని మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు బంధించారు. అనంతరం పులి అలజడి తగ్గింది. నవంబరు 29న కాగజ్ నగర్ రేంజ్ లోని ఈస్గాం బీట్ లో పత్తి ఏరేందుకు వెళ్లిన గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి పై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే సిర్పూర్ టీ మండల కేంద్రానికి సమీపంలోని దుబ్బగూడ శివారులో పత్తి చేనులో రైతు సురేశ్ పై దాడి చేయగా ప్రతిఘటించాడు. ఆయన భార్య కేకలు వేయడంతో అది పారిపోయింది దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి దంపతులు బయటపడ్డారు.