మాలిలో బంగారు గని కూలి 48 మంది మృతి

మాలిలో బంగారు గని కూలి 48 మంది మృతి

బమాకో: మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇల్లీగల్​గా నిర్వహిస్తున్న బంగారు గనిలో మట్టిపెల్లలు కూలిపడి 48 మంది దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. శనివారం కయెస్ రాష్ట్రంలోని కెనీబా జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెనీబా జిల్లా కేంద్రం, డబియా పట్టణాల మధ్యనున్న బిలల్​కొటొ గ్రామ సమీంలో ప్రమాదం జరిగిన గని ఉంది. గతంలో చైనాకు చెందిన ఓ కంపెనీ దీన్ని నిర్వహించేది. 

ప్రస్తుతం ఈ గనిలో మనుషులతో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. కూలీలు గనిలో పనికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 48 మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని స్థానిక అధికారులు, పోలీసులు మీడియాకు తెలిపారు. 

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉందని చెప్పారు. ఏడాది కింద కూడా ఇదే గనిలో ఒక సొరంగంలో పైకప్పు కూప్పకూలి 70 మందికి పైగా చనిపోయారు. ఈ ఏడాది జనవరి 29న కౌలికొరొ రాష్ట్రం డాంగా ప్రాంతంలో ఒక బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 10 మంది మరణించారు.