మంచాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుడు వెదిరె చల్మా రెడ్డి (54) ఇకలేరు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. లివర్ సమస్యతో బాధపడుతున్న చల్మారెడ్డి.. గత కొద్ది రోజులుగా సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గుండెపోటుకు గురై చనిపోయారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మునిసిపాలిటీ రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న చల్మారెడ్డిది మంచాల మండలం ఆరుట్ల స్వగ్రామం. ఆయనకు భార్య సువర్ణ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ‘జై తెలంగాణ పార్టీ’ ని స్థాపించిన ఇంద్రారెడ్డికి ఆయన సన్నిహితుడు.
అనంతరం తెలంగాణ మలిదశ ఉద్యమంలో చల్మారెడ్డి కీలక భూమిక పోషించారు. ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాంతో కలిసి ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో తూర్పు రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ గా వ్యవహరించారు. అనంతరం ఇబ్రహీంపట్నంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ జన సమితిలో కూడా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం అన్నింటికి దూరంగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి సబిత, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, నాయకులు రాణీరుద్రమ, చెరుకు సుధాకర్ తదితరులు వెదిరె భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో వెదిరె అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన దహన సంస్కారాలు సాహెబ్ నగర్ శ్మశానవాటికలో జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పలు పార్టీల నాయకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.