తొలి ఓటరు ఊరు.. అభివృద్ధిలో ఆఖరు

 తొలి ఓటరు ఊరు.. అభివృద్ధిలో ఆఖరు
  • సమస్యలకు నిలయంగా ‘మాలిని’ గ్రామం
  • మిషన్​ భగీరథ నీళ్లు రాక చేదబావే దిక్కు
  • రవాణా సౌలత్​ లేదు.. ఆర్టీసీ బస్సు ఎరుగరు
  • ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే 40కి.మీ ప్రయాస
  • ఆఫీసర్లు రారు.. అభివృద్ధి జరుగదు

ఆసిఫాబాద్ / కాగజ్ నగర్, వెలుగు :   ‘మాలిని ’  ఆ ఊరే ఒక స్పెషల్.  తెలంగాణ  రాష్ట్రంలోని  తొలి పోలింగ్ కేంద్రం అక్కడే ఉంది.  తొలి ఓటర్ కూడా ఆ ఊరివారే.  జిల్లాలోనే తొలి గ్రామపంచాయతీ కూడా ఆ ఊరే.   అయితే పేరుకే అన్నింట్లో ఫస్ట్.. అభివృద్ధిలో లాస్ట్  అన్నట్టు తయారైంది ఆ ఊరి పరిస్థితి.   కనీస సౌకర్యాలు లేక అక్కడి గిరిజనులు గోస పడ్డున్నారు.  ఈ గ్రామం  కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలంలో ఉంది. 

మాలిని గ్రామం నుంచి  కాగజ్ నగర్ కు వెళ్లాలంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అది కూడా సిర్పూర్(టి) మండల కేంద్రం మీదుగా పోవాలి.  అయితే ఆ ఊరికి  సరైన రోడ్డు,  రవాణా సౌలత్​ లేదు.  ఆ ఊరి గిరిజనం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును కూడా ఎరుగరు.  ప్రపంచమంతా 5జీ , ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టినా.. ఇక్కడి సెల్ టవర్ కు  ఒక పాయింట్ సిగ్నల్ కూడా ఉండదు.  అర్ధరాత్రి అపదొస్తే 108 వాహనం కూడా రాదు. బైక్​లు, ఆటోల్లో  కనీసం 20 కి.మీ వెళ్తే కానీ వైద్యం అందని దుస్థితి.  దేవుడా నీవే దిక్కు అనుకొని గిరిజనులు తమ బతుకు సాగిస్తున్నారు. 

ఒడవని సమస్యలు..

గతంలో మాలిని గ్రామం ఇక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే వాంకిడి మండలంలోనే ఉండేది. అయితే జిల్లాల పునర్విభజనలో కాగజ్ నగర్ మండలంలో కలిపారు. ఈ గ్రామ పంచాయతీలో పెద్ద మాలిని, చిన్న మాలిని, మానిక్ పటార్​ గ్రామాలు ఉన్నాయి.  సర్కార్ అందరికీ అందించామని చెప్పుకుంటున్నా మిషన్ భగీరథ మంచినీళ్లను ఇప్పటికీ ఈ ఊరిజనాలు ఇంకా రుచి చూడలేదు.  ఇప్పటికీ బావి, బోరు నీరు తాగాల్సిందే.  పదేండ్ల కింద అప్పటి ఐటీడీఏ పీవో  ఆర్ వీ కర్ణన్ తర్వాత  ఏ అధికారి గ్రామానికి వచ్చింది లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అడవిని నమ్ముకోవడమే.  గొడవలు జరిగినా,  మరేవైనా  సమస్యలు  వచ్చినా పోలీసు స్టేషన్​ వెళ్లే పరిస్థితులు లేవు.   40 కిలోమీటర్లు ప్రయాణించి నరకయాతన పడలేమని  ఊళ్లోనే  పంచాయితీ ద్వారా తేల్చుకుంటారు.   మిషన్​ భగీరథ నీళ్లు, రోడ్డు, రవాణా , వైద్య సాయం, సెల్​ఫోన్​ టవర్​.. తదితర సౌలతులు కల్పించాలని  కలెక్టర్, ఐటీడీఏ పీవో ను గ్రామ గిరిజనులు కోరుతున్నారు.  

అంబులెన్స్ రాదు..


మాకు ఎటువంటి సౌలతులు లేవు. పంచాయతీ సెక్రటరీ తప్ప ఏ ఆఫీసరూ మా ఊరికి రారు. ఊరిలో బడి దగ్గర సెల్ టవర్ నిర్మించి నాలుగేండ్లు అయితాంది. ఇప్పటికీ సిగ్నల్ వస్తలేదు.  మొదటి ఓటర్ అంటూ నా దగ్గరకు అందరూ వస్తున్నారు.  కానీ ఊరిలో  సౌలతుల గురించి మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు.  నా భర్త చనిపోయాడు. కూతురు కల్యాణి తో కలిసి కూలి పని చేసుకుంటున్నా. 
- సుర్పం మారుబాయి , రాష్ట్ర తొలి ఓటరు

ఏ కాలమైనా బావి నీళ్లే 

మాలిని ఊరు గురించి ఆఫీసర్లు పట్టింపు చేయరు. నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి ఎన్నో సార్లు చెప్పినా  ఆఫీసర్లు , లీడర్లు పట్టించుకోలేదు. ఏజెన్సీ గ్రామంలో కనీసం తాగేందుకు మంచి నీళ్లు రావు. మిషన్ భగీరథ పైపులు వేసి వదిలేశారు. ఇప్పుడు వాన కాలం బావి, బోరింగ్ నీళ్లే తాగుతున్నం. రవాణా సౌకర్యాలు లేక గర్భిణులు ఇబ్బందులు పడ్తున్నారు. 
- దౌలత్ రావు , మాలిని మాజీ సర్పంచ్

రూం రెంట్​కు  తీసుకుని కొడుకును చదివిస్తున్నా..


నా కొడుకు చదువు కోసం 20కి.మీ దూరంలో ఉన్న సిర్పూర్ టీ లో రూము కిరాయి తీసుకున్న. నా భార్య, కొడుకును అక్కడకు పంపించి ప్రైవేట్ స్కూల్ లో  చదివిస్తున్న. నేను వారం పది రోజులకు ఒకసారి వెళ్లి చూసి, సామాన్లు కొని ఇచ్చి వస్తున్న.   ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేక వానలకు వాహనాలు రావడం లేదు. నేను డిగ్రీ చదివినా నాకు ఐటీడీఏ నుంచి ఏ సహకారం లేదు.  
- పెందోర్ బాపూజీ, గ్రామస్తుడు