
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. ఆయా గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, అధ్యాపకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వాటిని పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో గురుకుల టీచర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. గురుకులాల్లో కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంతో పోరాడుతానన్నారు.
గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్పుతో పాటు టీచర్లకు బోధనేతర పనులు లేకుండా అన్ని చోట్ల కేర్ టేకర్లను నియమించేలా ఉత్తర్వులిప్పిస్తానని హామీ ఇచ్చారు. గురుకులాల్లో పాత టైంటేబుల్ అమలు చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అన్ని సొసైటీ టీచర్లందరికీ 010 పద్దు కింద జీతాల కోసం కృషి చేస్తానని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు శాసనమండలిలో టీచర్ల తరఫున పోరాడుతానని స్పష్టం చేశారు.
గురుకులాల స్టూడెంట్లు సాధిస్తున్న విజయాల వెనుకున్న టీచర్ల శ్రమను ప్రభుత్వం గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గురుకులాల్లో టీచింగ్‌తో పాటు హౌస్ మాస్టర్, కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్, సూపర్‌వైజరీ స్టడీస్, నైట్ స్టే, ఎస్కార్ట్ తదితర విధులను నిర్వహిస్తున్న టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు బోధనేతర పనుల భారం తగ్గించి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు.