మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్.. మెదక్​ సెగ్మెంట్​లో సేవా కార్యక్రమాలు షురూ

మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్.. మెదక్​ సెగ్మెంట్​లో సేవా కార్యక్రమాలు షురూ

మెదక్, వెలుగు:  మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్​ మళ్లీ యాక్టివ్​అయ్యారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్.. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ నియోజకవర్గంలో పర్యటనలు, సేవా కార్యక్రమాలు షురూ చేశారు. బుధవారం హవేలి ఘనపూర్​ మండలం గాజిరెడ్డిపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్​ ప్లాంట్ ప్రారంభించారు. ఏడుగురు పిల్లల పేర్లమీద రూ.25 వేల చొప్పున ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసి ఆ పత్రాలను పంపిణీ చేశారు. గుడికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.  

ఇతర మండలాల్లోనూ పర్యటనలు, సేవా కార్యక్రమాలు కొనసాగించేలా ప్రణాళిక రెడీ చేసుకున్నారు. తన కొడుకు రోహిత్​కు మెదక్ టికెట్​ వస్తుందని హన్మంతరావు​ఆశించినప్పటికీ.. పార్టీ అధినేత కేసీఆర్​అతనికి టికెట్​ కేటాయించలేదు. అందుకు మంత్రి హరీశ్​రావే​ కారణమని హన్మంతరావు ఫైర్​అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన కొడుక్కి బీఆర్​ఎస్​ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్​గా అయినా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నెల 26న మల్కాజ్​ గిరితోపాటు, మెదక్ సెగ్మెంట్​కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. వారం రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఈ క్రమంలో వారం గడవక ముందే రోహిత్​మళ్లీ మెదక్ సెగ్మెంట్​లో పర్యటిస్తూ సోషల్​ సర్వీస్​ కొనసాగిస్తున్నారు. దీంతో అతడు తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది. అయితే, అతడు ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారా? అన్నదానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.