
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, పద్మా దేవేందర్‌రెడ్డి అవినీతి చరిత్రను బయటపెడతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మెదక్, హవేళీ ఘనపూర్ మండలాలకు చెందిన పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామాయంపేటలోని జైకా హోటల్ వద్ద హవేలీ ఘనపూర్ మండల సర్పంచ్ నోముల సబిత, ఆమె భర్త నోముల శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ, జక్కన్నపేట సర్పంచ్ సిద్ధమ్మ- సాయిలు, నాగపూర్ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, మెదక్ మండలం పేరూర్ సర్పంచ్ జానకీ రామ్‌రెడ్డితో పాటు దాదాపు 300 మంది ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ పద్మా దేవేందర్‌రెడ్డి అవినీతి, అరాచకంపై అందరూ కలిసి ఆమెను ఓడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపదలో ఉన్నారంటే వెంటనే మీ ముందు ఉంటాను. కుటుంబసభ్యుడిగా భావించి మైనంపల్లి రోహిత్‌ను గెలిపించండి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాది జీవన్ రావు, హవేళీ ఘనపూర్ నాయకులు శ్రీనివాస్, సిరిమల్లె శ్రీనివాస్, శేరి మహేందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నాగాపురం సర్పంచ్ ఒంటరి రాజేందర్ రెడ్డి, మంజుల సిద్ధాగిరి గౌడ్, అక్బర్, బొజ్జ పవన్, పరుశురాం గౌడ్, ఉప్పల రాజేశ్, ఆదిల్, అజ్మీర స్వామి నాయక్, మెదక్, హవేలీ ఘనపూర్ మండల నాయకులు పాల్గొన్నారు.