భద్రాచలం, వెలుగు: ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు 173.41 కి.మీల రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ సర్వే షురూ చేసింది. భద్రాచలానికి 48 కిలోమీటర్ల దూరంలో విలీన ఆంధ్రా కూనవరం మండలం జగ్గారం వద్ద మూడురోజులుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్ కోసం ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్రల నుంచి మూడు టీంలు వచ్చాయి. 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్కోసం పంపుతున్నారు. మల్కన్‌గిరి నుంచి బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైను నిర్మించనున్నారు. ఈ లైన్తెలంగాణలో సుమారు 12కి.మీల మేర ఉంటుంది. ఇది సికింద్రాబాద్ నుంచి పాండురంగాపురం లైన్‌కు కలవనుంది. మొత్తం 12 స్టేషన్లు, వాగులు, నదులపై 213 వంతెనలు(48 పెద్దవి, 165 చిన్నవి) నిర్మించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నేల స్వభావాన్ని పరిశీలించేందుకు రైల్వే శాఖ సాయిల్ టెస్ట్ చేపట్టింది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ ఏడాది ఏప్రిల్ 22న ఒడిశాలోని కోరాపూట్‌లో ఈ రైల్వే లైన్ ప్రకటించారు.
ఈ లైన్ ఏర్పాటుతో టూరిజం డెవలప్మెంట్
భద్రాచలం-–మల్కన్‌గిరి రైల్వే లైన్ ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్తో పాటు, ఆంధ్రా, ఒడిశా,ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో లభించే ఖనిజాల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం భద్రాచలానికి 12 కి.మీల దూరంలో పాండురంగాపురం, 40 కి.మీల దూరంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి ఏటా 30 లక్షల మంది భక్తులు వస్తుంటారు. భద్రాచలానికి నేరుగా రైలు మార్గం ఉంటే ఉత్తరాది నుంచి కూడా భక్తుల రాక పెరుగుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరిపై రెండు భారీ వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు రైల్వే లైన్ కోసం మరో భారీ వంతెన నిర్మించనున్నారు. రైల్వే లైన్ సర్వే షురూ కావడంతో భద్రాచలం డెవలప్మెంట్పై ఆశలు రేకెత్తుతున్నాయి.