మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు స్పెషల్ దావత్ ఇస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ప్రచారం అయిపోగానే ఓ షెడ్డులో జనం, కార్యకర్తలకు మందు, విందు ఏర్పాటు చేశారు. అక్కడే సపరేట్ రూమ్ లో మంత్రి మల్లారెడ్డి స్వయంగా గ్రామస్తులకు ఇట్ల మందు పోసి అర్సుకున్నరు.
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మందు కలుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉప ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, రెడ్డిగూడెం, కాట్రావు గ్రామాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొనే వారందరి కోసం హైవేపై ఉన్న లాడ్జీని బుక్ చేసుకున్నారు. ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ఆదివారం ఆరెగూడెంలో మంత్రి పర్యటించారు. కార్మిక శాఖ మంత్రి కాబట్టి కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన వారందరికీ మందుతో కూడిన దావత్ ఏర్పాటు చేశారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం మిత్రపక్షాలైన కమ్యూనిస్టు లీడర్లతో పాటు టీఆర్ఎస్కు చెందిన అసంతృప్త లీడర్లతో మాట్లాడారు. వారిని తాను బస చేసిన లాడ్జీకి తీసుకెళ్లారు. అక్కడ తన పక్కనే కూర్చోబెట్టుకొని ఉప ఎన్నికలు, బీజేపీ పరిస్థితి, టీఆర్ఎస్ పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇదే సమయంలో కూర్చున్న చోటుకు మందు రావడంతో కమ్యూనిస్టు లీడర్లతో పాటు సొంత పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులకు స్వయంగా మంత్రి మందు పోశారు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.