- ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మల్లయ్యది పెద్దపల్లి జిల్లా రాణాపూర్
గోదావరిఖని, వెలుగు : మిలిటెంట్‌గా పనిచేస్తున్న టైంలో పోలీసులు చంపుతారన్న భయంతో పారిపోయి పూర్తి స్థాయిలో అడవి బాట పట్టిన పెద్దపల్లి జిల్లాకు చెందిన వేగోలపు మల్లయ్య (45) ప్రస్తానం ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. 20 ఏండ్ల వయస్సులోనే మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లిన మల్లయ్య అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటి ముఖం చూడలేదు. పెద్దపల్లి జిల్లా రాణాపూర్ గ్రామానికి చెందిన వేగోలపు గట్టయ్య, వెంకమ్మ దంపతులకు నలుగురు కొడుకులు కాగా మల్లయ్య ఆఖరివాడు.
అప్పట్లో గ్రామంలో పీపుల్స్‌వార్ ప్రభావం ఎక్కువగా ఉండడం, ఆ గ్రామం నుంచి చాలా మంది పీపుల్స్‌వార్‌లో పెద్ద లీడర్లుగా ఎదగడంతో వారి ప్రభావం మల్లయ్యపై పడింది. గ్రామంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ వ్యవసాయం చేసే మల్లయ్య పీపుల్స్‌వార్ మిలిటెంట్‌గా పోస్టర్లు అంటించడం, వాల్‌రైటింగ్ చేయడం వంటి పనులు చేసేవాడు. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరింది. దీంతో తనను చంపుతారని భయపడిన మల్లయ్య వారి నుంచి తప్పించుకునేందుకు రాణాపూర్‌లోని చెరువులో దూకాడు.
పోలీసులు వెళ్లిపోయిన తర్వాత చెరువు అవతలి ఒడ్డుకు చేరుకొని అటు నుంచి అటే అడవి బాట పట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు 25 ఏండ్లలో ఒక్కసారి కూడా గ్రామం వైపు రాలేదు. మల్లయ్య చిన్నతనంలో చాలా ధైర్యంగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. మల్లయ్య మహదేవపూర్, ఏటూరునాగారం, ములుగు, తదితర ఏరియాలతో పాటు చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం ఆయన మావోయిస్ట్ పార్టీలో కీలక పదవిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మల్లయ్య ముగ్గురు సోదరులు గ్రామంలోనే ఉంటున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మల్లయ్య చనిపోయిన విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు. ములుగు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న మల్లయ్య డెడ్‌బాడీని తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం వెళ్లనున్నారు.