గుజరాత్​లో బీజేపీ ధీమాకు కారణాలేమిటి?

గుజరాత్ శాసన సభకు డిసెంబర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు 4 కోట్ల 90 లక్షల మంది వరకు ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది. ఇక్కడ రెండు దశాబ్దాలకు పై నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలో ఉంది. కానీ, 2002 ఎన్నికల నుంచి ఆ పార్టీ సంఖ్యా బలం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2002 ఎన్నికల్లో 127 స్థానాలు,  2007 ఎన్నికల్లో 117 స్థానాలు గెలుచుకోగా, 2012లో 116  స్థానాలకు తగ్గింది. గడచిన(2017) ఎన్నికల్లో దాని బలం రెండు అంకెలకు (99) మాత్రమే పరిమితమైంది. అయినా, ఈసారి ఎన్నికల్లో కూడా తమదే విజయమనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నది. పోలింగ్ ముగియక ముందే  విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారంటే  దానికి తగిన కారణాలు ఉండి ఉండాలి.  

చీలుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు

గుజరాత్ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో  ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు అటు కేంద్రంలో, ఇటు గుజరాత్ లో బలమైన నాయకత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలను ఈ మధ్యనే చేపట్టారు. పార్టీని పునరుజ్జీవింప చేసే పనులకు ఆయన ఇప్పుడిప్పుడే శ్రీకారం చుడుతున్నారు.  గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగదీశ్ ఠాకోర్ వ్యవహరిస్తున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా బరిలోకి దిగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. ఎన్సీపీ,  భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ), భారత్ ఆదివాసీ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ఏఐఎంఐఎం వంటి మరికొన్ని చిన్న చితక పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్1995 నుంచి ఆరు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా ఓటమిపాలైంది. గత పదేండ్లలో అనేక మంది నాయకులు కాంగ్రెన్ ను వీడి బీజేపీలో చేరారు. 

పనిచేయని వారిని పక్కన పెట్టడం

బీజేపీ ఈసారి గుజరాత్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 42 మందికి టికెట్ ఇవ్వలేదు. వీరిలో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగిన 19 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం మంచి విధానమే. వారు పార్టీ చిహ్నంపై పోటీ చేస్తారు కాబట్టి వారు సరిగ్గా పనిచేయకపోతే పార్టీయే జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. పేలవమైన పనితీరు కనబరచిన వారిని పార్టీ తిరిగి నిలబెట్టలేదు. ఈ పద్ధతిని ఈ ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు కూడా బీజేపీ అమలు జరిపి సఫలమైంది. యూపీలో 2017 ఎన్నికల్లో 312 మంది ఎన్నికైతే వారిలో ఈ ఏడాది తిరిగి పోటీ చేసిన వారు149 మంది మాత్రమే.

ముస్లిం ఓటర్లు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. కానీ, మొన్నీమధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున దాదాపు200 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. ముస్లిం ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గుతున్న సంగతిని ఇది సూచిస్తున్నది. పైగా, రాష్ట్రంలో గత 24 ఏండ్లుగా శాంతి, సామరస్యంతో కూడిన వాతావరణమే కొనసాగుతున్నది. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేయగల నియోజకవర్గాలు దాదాపు27 ఉన్నాయి. రాష్ట్ర మొత్తం జనాభా 6, 04,39,692 మందిలో ముస్లింలు 58,46,761 మంది వరకు ఉన్నారు.  గుజరాత్ లో 27 ఏండ్లుగా అధికారంలో ఉండబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడటం సహజం. దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఈసారి ముస్లిం నాయకులు, కార్యకర్తలు 5,000 మందిని ఇంటింటికి పంపి ప్రచారం చేసేట్లు చూసింది. బీజేపీ ముస్లిం మోర్చాకు చెందిన మరో 250 మంది నాయకులు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి గుజరాత్ లో ప్రచారం చేస్తున్నారు.“ముస్లింలకు కానీ, మరి ఏ ఇతర మైనారిటీ వర్గానికి కానీ బీజేపీ ఎంత మాత్రం అంటరానిది కాదు” అని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖీ ఇటీవల అన్నారు. గుజరాతీల అసలు మనోగతం ఎన్నికల ఫలితాలతోనే తెలుస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 

ప్రచారపు పదనిసలు

ఎన్నికల ప్రచారాన్ని ఆకర్షణీయమైన రీతిలో నిర్వహించడంలో బీజేపీ నాయకులది అందెవేసిన చేయి. పాల ఉత్పాదనలో గుజరాత్, తేయాకు ఉత్పత్తిలో అస్సాంది అగ్ర స్థానం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ “గుజరాత్ కా దూధ్ ఔర్ అస్సాం కా చాయ్ మిలా కే, సబ్ సే  బధియా చాయ్ బనానే వాలే దేశ్ కే ప్రధాన్ మంత్రీ నరేంద్ర మోడీ జీ హై”  అంటారు. గుజరాత్ కు దాదాపు 3,219 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించేందుక వెళ్లిన ప్రధాని అక్కడా గుజరాత్ ప్రస్తావన తెస్తారు. ఆయన అక్కడ “సూర్యుడు అరుణాచల్ లో ఉదయిస్తాడు. గుజరాత్ లో అస్తమిస్తాడు” అంటారు. అలాగే, కృష్ణుడిది గుజరాత్ లో ద్వారక. ఆయన అరుణాచల్ కి చెందిన రుక్మిణిని పెళ్లి చేసుకున్నారంటారు. ఆ సందేశం ఎవరికి చేరాలో వారికి చేరుతుందని ఆయనకు తెలుసు. గుజరాత్ లో పోర్ బందర్ జిల్లాలో మాధవ్ పూర్ అనే గ్రామం ఉంది. అక్కడ ఏటా రుక్మిణి కల్యాణాన్ని నిర్వహిస్తారు. దాన్ని తిలకించేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారంటేనే దాన్ని ఎంత ఆకర్షణీయంగా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. కుటియానా నియోజకవర్గంలోకి వచ్చే మాధవ్ పూర్ గ్రామంలో దాదాపు15,000 మంది ఓటర్లు ఉంటారు. కాశీలో తమిళుల కార్యక్రమంలో పాల్గొంటూ తమిళ వారసత్వ సంపదను కాపాడుకోవాలంటూ దేశంలోని మొత్తం130 కోట్ల మంది ప్రజలకూ పిలుపునిస్తారు. ఔను మరి. గుజరాత్ లో తమిళులు చాలా మంది ఉన్నారు. అహ్మదాబాద్ లోనే సుమారుగా లక్షన్నర మంది ఉంటారు. మోడీ మాజీ అసెంబ్లీ నియోజకవర్గం మణినగర్ లో ‘ మినీ తమిళనాడు’ ఉందని ప్రతీతి. అంతర్జాతీయంగానూ మారు మోగుతున్న మోడీ పేరు గుజరాత్ లో కమలనాథులకు కదనోత్సాహం కలిగిస్తున్నది.

ఎన్నికల ప్రణాళికలు

ఉమ్మడి పౌర స్మృతి సిఫార్సులను అమలు చేస్తామని, అల్లర్లకు పాల్పడేవారి ఆస్తులను స్వాధీనపరచుకునేందుకు చట్టం తీసుకొస్తామని, రాడికల్స్ తలెత్తకుండా పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఈ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. మత మార్పిడులను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య రక్షణ, సబ్సిడీపై సిలిండర్ల సరఫరా, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీలు గుప్పించాయి. బీజేపీ కూడా కొన్ని ఉచితాలను ఆశపెట్టకపోలేదు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య రక్షణ, రెండు ఉచిత సిలెండర్లు, సబ్సిడీ ధరలకు శెనగలు, వంట నూనె సరఫరా వంటివి ఆ పార్టీ ప్రణాళికలో ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ మరో అడుగు ముందుకేసి కాలేజీలకు వెళ్లి చదువుకునే అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని కూడా చెప్పింది. అహ్మదాబాద్ లో 2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటున్నది. పది లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని మొత్తం మూడు పార్టీలు వాగ్దానం చేశాయి. 

పాటీదార్లతో సయోధ్య

గుజరాతీలో పాటీ అంటే  భూమి. దార్ అంటే ధరించినవాడు. వ్యవసాయం చేసే వర్గం వారని అర్థం చేసుకోవచ్చు. ఈ కులంలో ఉపశాఖలు చాలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే పాటీదార్లు గుజరాత్ లో బలమైన వర్గాల్లో ఒకటిగా ఉన్నారు. రిజర్వేషన్ల కోటాకు సంబంధించిన ఉద్యమ నేపథ్యంలో బీజేపీ 2017 ఎన్నికల్లో  పాటీదార్ల ఆగ్రహాన్ని చవి చూసింది. వారిని మచ్చిక చేసుకునేందుకు 2021 సెప్టెంబర్ లో భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిని చేసింది. పాటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ ను పార్టీలోకి చేర్చుకుంది. ఈ రెండు అంశాలు ఈసారి పార్టీకి అనుకూలంగా పనిచేయవచ్చు.  బీజేపీకి గుజరాత్ లో అద్భుతమైన కార్యకర్తల వ్యవస్థ ఉంది. అట్టడుగు స్థాయిలో పురపాలక సంస్థలు, పంచాయతీలే కాకుండా పోలింగ్ కేంద్రం వరకు విధేయతతో, నిబద్ధతతో పనిచేయగల కార్యకర్తలు గుజరాత్ అంతటా ఉన్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీలు దాని దరిదాపుల్లో కూడా లేవు. - మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్