
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటించి, ములుగు మాజీ జడ్పీ చైర్మన్, దివంగత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ పేరు పెట్టాలని మండల సాధన సమితి నాయకులు వేడుకున్నారు. కుసుమ జగదీశ్కుటుంబానికి పార్టీ చెక్కు అందజేందుకు సోమవారం మల్లంపల్లికి వచ్చిన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితను కలిసి విన్నవించారు.
సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు ఎంపీ కాళ్లపై పడి ప్రాధేయపడగా, కాళ్లమీద పడొద్దని కవిత వారించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. జగదీష్ చిరకాల కోరిక మల్లంపల్లిని మండలం చేయడమేనని చెప్పారు. స్పందించి ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మండలంగా మారుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. స్పందించిన ఎంపీ కవిత సీఎం కేసీఆర్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.