- 50 వేల మందితో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
- ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
- శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్లతో సందడి
మెట్‌పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దపూర్‌లో మల్లన్న బోనాల జాతర వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం హోలీ తర్వాత మొదటి ఆదివారం ఇక్కడ బోనాలు
నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా బోనాలతో హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయమే ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనం కోసం బారులుదీరారు.
పట్నాలు వేసి, బోనం, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతల మధ్య బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం రథోత్సవం జరిపారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.