సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న మహా జాతర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. మూడు నెలలు సాగే ఈ మహాజాతరకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. మొదటి ఆదివారం పట్నం వారంగా నిర్వహిస్తుండడంతో ఈ ఒక్క రోజే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి లక్షకు పైగా భక్తులు రానున్నారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో మూడు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.
క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా మల్లికార్జున స్వామిని ధూళి దర్శనం చేసుకుని సోమవారం తెల్లవారుజామున నిర్వహించే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే జాతర 12 వారాల పాటు కొనసాగుతుంది. ఏప్రిల్24న జాతర ముగుస్తుంది. మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్నాటక నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నెల 26న లష్కర్ వారం నిర్వహిస్తారు.
పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా చలువ పందిళ్లు వేసి క్యూలైన్లు ఏర్పటు చేయడంతో పాటు ప్రత్యేక, ధర్మ దర్శనాల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం తోట బావి వద్ద నిర్వహించే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు..
కొమురవెల్లిలో పట్నం వారం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీపీ బి. అనురాధ టెంపుల్ పరిసర ప్రాంతాలతో పాటు క్యూ లైన్లు, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. టెంపుల్ ఆవరణను ఒక సెక్టార్ గా, పార్కింగ్ ప్రదేశాలను రెండవ సెక్టార్ గా, తోట బావి ప్రాంతాన్ని మూడవ సెక్టార్ గా విభజించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తోట బావి, పార్కింగ్, టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 510 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.