
సిద్దిపేట రూరల్, వెలుగు: చనిపోయిన తమ భర్తల పేరిట ఉన్న పట్టాలను తమ పేరుపై ఎందుకు చేయడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్‌కు చెందిన మహిళలు అధికారులను నిలదీశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఆర్‌అండ్‌ఆర్ కింద ఇల్లు/ప్లాటును భర్తల పేరిట రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. అయితే పట్టాలు పొందిన వారిలో చాలామంది చనిపోయారని ఆ పట్టాలను తమ పేరుపై చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ వారి వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ములుగు మండలం కొక్కొండలో ఉన్న బండచెరువును పూడ్చి నిర్మాణం చేపట్టిన హైదరాబాద్‌కు చెందిన సుమన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోదా అరుణ్ యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సందబోయిన ఎల్లయ్య అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని పందిళ్ల స్టేజీని ప్రత్యేక జీపీగా మార్చొద్దని గ్రామస్తులు కోరారు.