
- కేసీఆర్‌కు మల్లన్న సాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ
గజ్వేల్, వెలుగు: బుధవారం అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై చర్చించాలని, లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని, తమకు న్యాయం జరిగేదాక అక్కడే వంటావార్పు చేస్తామని మల్లన్నసాగర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌కు బాధితులు బహిరంగలేఖ రాశారు. ఈ లెటర్ సోషల్‌మీడియాలో వైరల్అవుతున్నది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేయగా కేసీఆర్, హరీశ్‌రావు తమకు అన్యాయం చేశారని అందులో వాపోయారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని ముంపుకు గురైన తొగుట మండలానికి చెందిన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కుకునూర్ పల్లి మండలం ఎర్రవెల్లి, సింగారం గ్రామాలకు చెందిన నిర్వాసితులు అన్నారు.
లేఖలో ఏం రాశారంటే..
గతేడాది డిసెంబర్ 16న మీకు లేఖ పంపించాం. దానిపై నేటికి స్పందించలేదు. అసెంబ్లీకి వెళ్లి మా సమస్యలపై మాట్లాడలేదు. మాజీ మంత్రి హరీశ్ రావు ఫిబ్రవరి 7న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు ఇటీవల మీడియాకు చెప్పారు. కానీ ఈ విషయం హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించలేదు. తన నియోజకవర్గంలోని అంతగిరి సాగర్, రంగనాయక సాగర్ నిర్వాసితుల గురించి, కొచ్చగుట్టపల్లి బాధితుల గురించి, చందాపూర్ పరశురాం గౌడ్ గురించి హరీశ్‌రావు ఎందుకు లేఖ రాయలేదు.
ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించని హరీశ్ రావు మా విషయంలో లేఖ ఎందుకు రాశారు? మల్లన్న సాగర్ లో వారి బ్రోకర్ల వ్యవస్థ గురించి తెలిసిపోతుందని, తమ అక్రమాలు బయటకొస్తాయని ఆయన నాటకాలు ఆడుతున్నారు. మీరు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మా సమస్యల గురించి తెలుసు. వారు మాకోసం 2 రోజులు దీక్ష కూడా చేశారు. వారేమీ మమ్మల్ని మరిచిపోలేదు. అతి త్వరలోనే సమస్యలు పరిష్కారిస్తామని ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. మధ్యలో ఇబ్బంది పెట్టి సమస్య తీరకుండా చేసేందుకు హరీశ్‌రావు నాటకాలు ఆడుతున్నడు.
నిండు అసెంబ్లీలో నిర్వాసితులకు చేసిన మోసాన్ని ఒప్పుకొని కేసీఆర్, హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలి. ఓపెన్లెటర్కు మాజీ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలి. బుధవారం మధ్యాహ్నంలోపు ఈ లేఖపై స్పందించకుంటే సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌ను ముట్టడిస్తం. కేసీఆర్ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల కష్టాల గురించి మాట్లాడే వరకు ఫామ్ హౌస్ వద్ద వంటావార్పు చేస్తం.