గజ్వేల్‌ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాలు విలీనం

గజ్వేల్‌ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాలు విలీనం
  • ఏడు పంచాయతీలను డీనోటిఫై చేసిన ఆఫీసర్లు
  • మారనున్న గజ్వేల్‌ మున్సిపల్ గ్రేడ్‌, పెరగనున్న వార్డులు

సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్‌తో ముంపుకు గురైన ఏడు గ్రామ పంచాయతీలు గజ్వేల్‌ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఇప్పటివరకు పంచాయతీలుగా కొనసాగిన ఏడు గ్రామాలను పంచాయతీ రాజ్‌ శాఖ డీనోటిఫైడ్‌ చేయడంతో అవి అధికారికంగా గజ్వేల్‌ మున్సిపాలిటీలో కలిసిపోయాయి. దీంతో గజ్వేల్ మున్సిపాలిటీ గ్రేడ్‌ మారడమే కాకుండా, వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. 

మల్లన్న సాగర్‌ నిర్మాణంతో తొగుట మండలంలోని వేములఘాట్‌, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మించి నాలుగేండ్ల కింద నిర్వాసితులను అక్కడికి తరలించారు. గతేడాది సెప్టెంబర్‌లో గ్రామ పంచాయతీల ఓటరు లిస్ట్‌ విడుదల చేసిన ఆఫీసర్లు కొన్ని గ్రామాల లిస్ట్‌ను పెండింగ్‌లో పెట్టారు. 

రెండు రోజుల క్రితం మరో 17 జీపీల లిస్ట్‌ను విడుదల చేసి ముంపు గ్రామాలను డీ నోటిఫై చేశారు. దీంతో ఆ గ్రామాలు గజ్వేల్‌ మున్సిపాలిటీలో విలీనం అయినట్లేనని, ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉండదని డీపీవో జానకీదేవి చెప్పారు. అయితే విలీనాన్ని వ్యతిరేకిస్తే మాత్రం పాలకవర్గం అమోదించిన తీర్మానాన్ని  ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

ముంపు గ్రామాల్లో ఏడు వేలకు పైగా ఓట్లు

గజ్వేల్‌లోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏడు ముంపు గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామాలు విలీనం కావడంతో గజ్వేల్‌ మున్సిపాలిటీలో వార్డులతో పాటు జనాభా కూడా పెరిగి గ్రేడ్‌ 2గా అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గజ్వేల్‌ పరిధిలో ప్రజ్ఞాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాల్లో సుమారు 50 వేలకు పైగా జనాభా ఉంది. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని జనాభాను కలుపుకుంటే 70 వేలకు చేరే అవకాశం ఉంది.మున్సిపాలిటీలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా, కొత్త గ్రామాల విలీనంతో మరో 10 వరకు వార్డులు పెరిగే చాన్స్‌ ఉంది. 

నిర్వాసితుల్లో భిన్నాభిప్రాయాలు

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలను గజ్వేల్‌ మున్సిపాలిటీలో విలీనం చేయడం పట్ల నిర్వాసితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీలో  విలీనం వల్ల పన్నుల భారం పెరుగుతుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. అభివృద్ధిలో వేగం పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. మరో వైపు ఈజీఎస్‌ జాబ్‌కార్డులు రద్దు అవడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులం కాకుండా పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.