![మల్లన్నసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు గండి](https://static.v6velugu.com/uploads/2025/02/mallannasagar-distributary-canal-to-gandi_EyZjPvF4oi.jpg)
- దుబ్బాక మండలం మల్లాయిపల్లి వద్ద పొలాల్లోకి చేరిన నీళ్లు
దుబ్బాక, వెలుగు: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్–4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు గండి పడడంతో సాగు నీరంతా వృథాగా పోతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి వార్డు మీదుగా మండలంలోని కమ్మర్పల్లి, చీకోడు, అచ్చుమాయపల్లి, పోతారం, గంభీర్పూర్, శిలాజీనగర్ గ్రామాల మీదుగా ఎగువ మానేరులోకి మల్లన్న సాగర్ నీరు చేరడానికి 14.54 కిలోమీటర్ల పొడవైన 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.
ఈ కెనాల్ పూర్తయితే 30 వేల ఎకరాలకు నీరందనుంది. మండలంలోని కమ్మర్పల్లి వరకు పనులు పూర్తయ్యాయి. వరి పంటకు నీరందించేందుకు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా చెరువులు, కుంటలు నింపుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో శుక్రవారం మల్లాయపల్లి వద్ద కెనాల్‌కు గండి పడింది. దీంతో సాగు నీరంతా వృథాగా పోవడమే కాకుండా, వరి పంట ధ్వంసమవుతోంది.
వరి పంటలో ఇసుక మేటలు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లాయపల్లి నుంచి దుబ్బాక మున్సిపాలిటీకి వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మల్లన్న సాగర్ నుంచి వచ్చే సాగు నీటిని బంద్ చేసి గండి పడ్డ కెనాల్‌కు రిపేర్లు చేయాలని రైతులు కోరుతున్నారు.