
భైంసా, వెలుగు: పార్టీలో కష్టపడి పని చేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, బీజేపీ ఎవరికీ అన్యాయం చేయదని ఆ పార్టీ నిర్మల్‌జిల్లా ఇన్చార్జ్మల్లారెడ్డి అన్నారు. టికెట్ రాకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమాదేవి కామెంట్స్‌పై ఆయన స్పందించారు. శనివారం భైంసాలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. లీడర్ల వల్ల పార్టీకి బలం పెరగలేదని, కార్యకర్తల కృషి, కష్టం మూలంగానే ముథోల్‌లో పార్టీ బలంగా ఉందన్నారు.
బీజేపీకి హిందుత్వ వాదమే బలమన్నారు. పార్టీ రెండుసార్లు రమాదేవికి టికెట్ ఇచ్చిందని, జిల్లా అధ్యక్ష పదవి సైతం ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర, కేంద్ర పార్టీల సర్వే ప్రకారమే బీజేపీ టికెట్‌ను రామారావు పటేల్ కు కేటాయించినట్లు పేర్కొన్నారు. రామారావు పటేల్ కు అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయనకు సహకరించాలని జిల్లా నాయకులు రమాదేవి వద్దకు వెళ్లి కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన రమాదేవి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, టికెట్ రాలేదని ఇష్టనుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లాలో అన్ని చోట్ల కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, సోమ రాజేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరికలు..
ఏఎంసీ చైర్మన్రాజేశ్ బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ఫ్యాక్టరీలో కుభీర్మండలం అంతర్ని తండాకు చెందిన 200 మంది రామారావు పటేల్సమక్ష్యంలో బీజేపీలో చేరారు.