దట్టమైన నల్లమల అడవి... చుట్టూరా కొండలు... వాటి మధ్యలో జాలువారే జలపాతం. ఈ దృశ్యం చూడాలంటే నాగర్‌కర్నూల్ వెళ్లాలి. ఇక్కడికి వెళ్తే చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి పురాతన దేవాలయం కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వీకెండ్ టూర్‌కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మధ్యలో, అటవీ ప్రాంతంలో ఉంది మల్లెలతీర్థం వాటర్‌ఫాల్. ఈ జలపాతం పేరు వెనక పురాణ కథ ప్రచారంలో ఉంది. అర్జునుడు మల్లెపూలతో ఇక్కడే శివుడికి పూజలు చేశాడని, అందుకే ఈ జలపాతానికి ‘మల్లెలతీర్ధం’ అని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో రుషులు తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహం పొందారట. దాదాపు ఐదొందల అడుగుల లోతు లోయ. లోయ గుండా జలపాతం దగ్గరకి వెళ్లడానికి 350 మెట్లు ఉంటాయి. ఇక్కడ నూటయాభై అడుగుల ఎత్తు నుంచి కిందకి దుమికే జలపాతం నీళ్లు వాన చినుకుల్లా శివలింగం ఆకారంలో ఉన్న రాళ్ల మీద పడతాయి. జలపాతం దగ్గరకు వెళ్లేందుకు 20 రూపాయల టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం అయిదు వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ కారు పార్కింగ్తో పాటు కాసేపు రెస్ట్ తీసుకునేందుకు గార్డెన్ కూడా ఉంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడికి వెళ్తే జలపాతం అందాల్ని చూడొచ్చు. నాగర్ కర్నూల్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది మల్లెల తీర్థం.
రెండో శతాబ్దం నాటి దేవాలయం
అమ్రాబాద్ మండలం లోని మన్ననూర్ గ్రామంలో ఉంది ఈ దేవాలయం. రెండో శతాబ్దం నాటి గుడి ఇది. చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి ఆలయంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ శివుడు ‘ఉమామహేశ్వరుడి’గా పూజలందుకుంటాడు. ఇక్కడ కనిపించే శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఒకవైపు తెలుపు రంగులో, మరోవైపు ఎరుపు రంగులో ఉంటుంది.
శివుడు ఇక్కడ సహజంగా ఏర్పడిన గుహలో కనిపించాడని చెప్తారు. కొండ మీద నుంచి నీళ్లు గుడి మీద పడుతుంటాయి. దాంతో గంగమ్మ శివుడి తలపై ఉందనడానికి ఇదే నిదర్శనం అని చెప్తారు స్థానికులు. గుడికి దగ్గర్లోనే పెద్ద కొలను ఉంటుంది. ఈ దేవాలయం గుహ లోపలికి చొచ్చుకొచ్చినట్టు ఉండడంతో ఇక్కడ ఎండ పడదు.