పల్నాడుకు మహిళా ఎస్పీ..  ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..

ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఈసారి ఎన్నికలు మునుపటికంటే హోరాహోరీగా సాగాయి. పోలింగ్ రోజున పలు చోట్ల అల్లర్లు జరగగా, పోలింగ్ మరుసటి రోజు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన అల్లర్లు రాష్ట్రంలో కలకలం రేపాయి.ఈ ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయా ప్రాంతాల్లో 144సెక్షన్ విధించి మూడు జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసి కొత్త ఎస్పీలను నియమించింది.

ఈ క్రమంలో పల్నాడు జిల్లాకు మల్లికా గార్గ్ అనే మహిళా ఎస్పీని నియమించింది ఈసీ. తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న పల్నాడు జిల్లాకు మహిళా ఎస్పీని నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మల్లికా గార్గ్ ఎవరు అన్న చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే, మల్లికా గతంలో ఒంగోలు, తిరుపతికి ఎస్పీగా పని చేశారు.ఈ ప్రాంతాలకు మల్లికా మొదటి మహిళా ఎస్పీ కావటం విశేషం. ఒంగోలులో ఎస్పీగా ఉన్న సమయంలో మల్లికా తప్పు చేసిన హెడ్ కానిస్టేబుళ్ల నుండి ఎస్సై, డీఎస్పీ వంటి అధికారుల పై కూడా చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి.

అయితే, తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మూడువారాల్లోనే మల్లికా బదిలీ అయ్యారు.వైసీపీ నేతల ఫిర్యాదుతో ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమించింది ప్రభుత్వం.మల్లికా గార్గ్ విధుల్లో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించేది కాదని, ఆమె పేరు చెబితే అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు పుడుతుందని టాక్ ఉంది. మల్లికా ట్రాక్ రికార్డ్ గురించి తెలిసినవారు పల్నాడు ఎస్పీగా ఆమెను నియమించడం సరైన నిర్ణయమే అని అభిప్రాయపడుతున్నారు.